హైదరాబాద్ లో జరిగిన ఓ హత్య కేసు.. విజయవాడ జనసేన నేత మెడకు చుట్టుకుంటోంది. కోగంటి సత్యం అనే ఆ జనసేన నేత… పేరు ఇప్పుడు హైలెట్ అవుతోంది. కొత్తగా హత్య కేసులో.. మరో స్కిట్ కూడా.. అందర్నీ నోరెళ్లబెట్టేలా చేసింది. పారిశ్రామికవేత్త రాంప్రసాద్ ను హైదరాబాద్ పంజాగుట్టలో హత్య చేశారు. ఈ హత్యను తామే చేశామంటూ… మీడియాకు నిందితులు పిలిచి ఇంటర్యూలు ఇచ్చారు. అసలు ఈ కేసులో వినిపిస్తున్న కోగంటి సత్యంకు సంబంధం లేదని.. వారే మీడియా ముఖంగా సర్టిఫికెట్లు కూడా ఇస్తున్నారు. శ్యామ్, చోటు, రమేష్ అనే ముగ్గురు వ్యక్తులు రాంప్రసాద్‌ను హత్య చేసామని చెబుతున్నారు. మరో ముగ్గురితో కలిసి తానే హత్య చేశానని ..ఒప్పుకున్నారు. అసలు పోలీసులు కేసు పీటముడి విప్పేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో.. అరెస్ట్‌కు ముందే పక్కా స్క్రిప్ట్‌తో మీడియా ముందుకు శ్యామ్ బృందం వచ్చింది.
గత ఎన్నికల్లో జనసేన తరపున కీలంగా వ్యవహరించిన కోగంటి సత్యం వ్యవహారాలను పోలీసులు బయటకు లాగుతున్నారు. ఆయన ఫోన్ డేటాను సైతం ఎంక్వైరీ చేసే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. ఎటువంటి ఆధారాలు దొరక్కుండా కోగంటి సత్యం పక్కా ప్లాన్ తో వ్యవహారించారని పోలీసులు కూడా భావిస్తున్నట్టు తెలుస్తోంది. హత్యకు మూడ్రోజుల ముందు సత్యం తిరుపతి వెళ్లి శ్రీవారిని దర్శించుకున్న అనంతరం అక్కడ కొన్ని వీడియోలను రికార్డ్ చేసి తన అనుచరుల ద్వారా మీడియాకు కు పంపారు. రాంప్రసాద్ హత్యకు గురయిన తర్వాత పలువురు మీడియా ప్రతినిధులకు కోగంటి సత్యం పిలిచి మరీ ఇంటర్వ్యూలు ఇచ్చారు కూడా.
ఈ హత్యకు మూలాలు మొత్తం బెజవాడలో ఉండి ఉంటాయని కూడా పోలీసులు తమదైన శైలిలో ఆ దిశగా కూడా దర్యాప్తు చేస్తున్నారు. కోగంటి సత్యం అల్లుడు కృష్ణారెడ్డిని విజయవాడలో తెలంగాణ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ నిమిత్తం హైదరాబాద్ తీసుకెళ్లారు. అల్లుడు కృష్ణారెడ్డి నుంచి కీలకమైన సమాచారాన్ని కూడా పోలీసులు రాబట్టారని సమాచారం. ఈ కేసులో ప్రధానంగా రాంప్రసాద్ ను హత్యచేసిన దుండుగులు ఎక్కడ తలదాచుకున్నారని కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. కోగంటి సత్యం అనుచరుల కదలికలపై కూడా నిఘా విధించారు. తిరుపతి వెళ్లిన కోగంటి సత్యం కుటుంబ సభ్యులు విజయవాడ రాగా, ఆయన హైదరాబాద్ ఎందుకు వెళ్లారనే కోణంలో కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. మొత్తానికి.. ఈ హత్య కేసులో పోలీసులకు.. ఓ సినిమా చూపిస్తున్నారన్న భావన మాత్రం పోలీసులలోనే వ్యక్తమవుతోంది.