పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గెలిస్తే తన పేరును మార్చుకుంటానని సవాల్ చేసిన ముద్రగడ ఇక పేరు మార్చుకునేందుకు రెడీ అవ్వాలంటూ జన సైనికులు రూపొందించిన ఓ పోస్ట్ వైరల్ అవుతోంది. పవన్ గెలుపు ఖాయమని గట్టిగా ప్రచారం జరుగుతుండటంతో జన సైనికులు ముద్రగడ సవాల్ ను తాజాగా తెరపైకి తీసుకొచ్చి పద్మనాభ రెడ్డిగా పేరు మార్చుకోవాలంటూ వినూత్న తరహలో సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ముద్రగడ పద్మనాభ రెడ్డి నామకరణ మహోత్సవ ఆహ్వాన పత్రిక మీ కోసం..అందరికీ నమస్కారం. నూతన నామకరణ మహోత్సవం. కాపు సోదర, సోదరీమణులందరికీ ప్రత్యేక ఆహ్వానం. 2024 జూన్ 4న సాయంత్రం ఆరు గంటల నుంచి తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో ఈ కార్యక్రమం జరుగుతుందని అందులో పేర్కొన్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గెలిస్తే పద్మనాభ రెడ్డిగా పేరు మార్చుకుంటానని సవాల్ చేసిన పెద్దాయన మాటపై నిలబెడుతారని నమ్మకం మాకుంది. కాబట్టి, ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని కోరుతున్నాం అంటూ ఆహ్వాన పత్రికను రెడీ చేశారు.
ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పిఠాపురంలో పవన్ గెలుపు ఖాయమని ప్రచారం నేపథ్యంలో నిజంగానే ముద్రగడ అన్నంత పని చేస్తారా..? అని చర్చ జరుగుతోంది.