ఇసుక కొరత కారణంగా ప్రభుత్వం వల్ల ఇబ్బంది పడిన భవన నిర్మాణ కార్మికులందర్నీ రెండు వారాల్లో ఆదుకోవాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ డెడ్‌లైన్ పెట్టారు. ప్రతీ కార్మికుడికి రూ. యాభై వేలు ఆర్థిక సాయం.. ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు రూ. ఐదు లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని.. డిమాండ్ చేశారు. ఇసుక కొరతను తీర్చి.. కార్మికుల్ని రెండు వారాల్లోగా కార్మికుల్ని ఆదుకోకపోతే.. అమరావతి వీధుల్లో నడుస్తానని హెచ్చరించారు. ఇసుక కొరత కేవలం.. ప్రభుత్వం సృష్టేనని.., ప్రకృతి వల్ల.. వచ్చిన ఇబ్బంది అంటూ.. ప్రభుత్వ పెద్దలు, మంత్రులు చేస్తున్న విమర్శలను పవన్ కల్యాణ్ ఘాటుగా తిప్పికొట్టారు. దేశంలో ఎక్కడా వర్షాలు, వరదలు రాలేదా..? గతంలో ఎప్పుడూ వరదలు రాలేదా..? అప్పుడు ఎప్పుడూ లేని.. ఇసుక కొరత ఇప్పుడు ఎందుకు వచ్చిందని.. పవన్ కల్యాణ్ సూటిగా ప్రశ్నించారు.
కష్టాల్లో ఉన్న వారికి దత్తపుత్రుడ్ని..!
జగన్ పై వ్యక్తిగత ద్వేషం లేదంటూనే.. పవన్ .. తీవ్రమైన విమర్శలు చేశారు. ప్రభుత్వంలో ఏకస్వామ్యం మాత్రమే ఉందని.. ప్రజాస్వామయ్యం లేదన్నారు. కూల్చివేతలతో ప్రారంభమైన ప్రభుత్వం కూలిపోతుందని జోస్యం చెప్పారు. చంద్రబాబుపై కోపంతో ఇంత మంది ప్రజల్ని శిక్షించడం ఏమిటని ప్రశ్నించారు. ప్రభుత్వంలో ఎక్కడా చర్చలు జరగడం లేదని.. ఒక వ్యక్తి ఆలోచనలకు అనుగుణంగా.. ప్రభుత్వాన్ని నడుపుతూ.. ప్రజల్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. అజేయకల్లాం లాంటి ఆలోచనాపరులున్నప్పటికీ.. ఇలా ఎందుకు జరుగుతోందని ప్రశ్నించారు. నిజంగా జగన్ అద్భుతంగా పరిపాలిస్తే తాను వెళ్లి సినిమాలు చేసుకుంటానన్నారు. తాను ఓడిపోయానని పదే పదే వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలను కూడా గట్టిగానే తిప్పికొట్టారు. వైసీపీ నేతలు చేసిన ప్రచారాలను నమ్మి ఓడించారన్నారు. నాగబాబు తీసుకొస్తే కన్నబాబు రాజకీయాల్లోకి వచ్చారని.. అలాంటి వ్యక్తి తనను విమర్శిస్తున్నారని మండిపడ్డారు.
జైలుకెళ్లొచ్చిన విజయసాయికి సమాధానం చెప్పాలా..?
తనపై విమర్శలు చేస్తున్న వైసీపీ నేతలపై పవన్ కల్యాణ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు దత్తపుత్రుడంటూ.. వైసీపీ నేతలు చేసిన విమర్శలకు ఘాటైన కౌంటర్ ఇచ్చారు. తాను కష్టాల్లో ఉన్న పేదలకు మాతరమే దత్త పుత్రుడినన్నారు. తాను ఆశయానికి కట్టుబడేవాడినన్నారు. తనపై విజయసాయిరెడ్డి చేస్తున్న విమర్శలపై మండిపడ్డారు. ఆయనేమైనా దేశం కోసం జైలుకెళ్లారా.. అని ప్రశ్నించారు. సూట్ కేసు కంపెనీలు పెట్టి.. ఆర్థిక నేరాలకు పాల్పడి జైలుకెళ్లారన్నారు. అలాగే.. రాజ్యసభకు వెళ్లాడన్నారు. పరిధి దాటి మాట్లాడితే.. తాటతీసి కూర్చోబెడతామని హెచ్చరించారు.
లాంగ్ మార్చ్ గ్రాండ్ సక్సెస్…!
కులాలు మతాలుగా.. వర్గాలుగా విభజించి.. ఏపీలో వైసీపీ చేస్తున్న పాలనను.. పవన్ కల్యాణ్ తీవ్రంగా ఆక్షేపించారు. ఏపీని కులాల కుంపటిగా చీల్చేశారని.. మండిపడ్డారు. ఇది మన దౌర్భాగ్యమన్నారు. తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల కోసం అందరూ ఏకమయ్యారని… భవన నిర్మాణ కార్మికుల కోసం అందరూ ఏకమవ్వాలని పిలుపునిచ్చారు. పవన్ కల్యాణ్ … లాంగ్ మార్చ్‌కు.. అనూహ్యమైన స్పందన వచ్చింది. ఎన్నికల తర్వా తొలి బిగ్ ఈవెంట్ కావడంతో.. కోస్తా జిల్లాల నుంచి జనసేన నేతలు.. పవన్ కల్యాణ్ అభిమానులు తరలి వచ్చారు. దాంతో.. విశాఖలో జనసంద్రం కనిపించింది. టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడు కూడా హాజరయ్యారు.