జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పొత్తులపై చర్చ జరిగింది. స్థానిక ఎన్నికల్లో కనీసం ప్రాతినిధ్యం దక్కించుకోవాలంటే.. బలమైన పార్టీలతో పొత్తులు పెట్టుకోవాలనే సూచనలు.. ఆ పార్టీ అగ్రనాయకత్వానికి అందాయి. వైసీపీతో.. ఎలాంటి పరిస్థితుల్లోనూ కలిసే అవకాశాల్లేవని.. బీజేపీతో పొత్తు పెట్టుకుంటే.. కలిసి వచ్చే అవకాశమే లేదన్న అభిప్రాయం పార్టీ నేతల్లో ఏర్పడింది. అసెంబ్లీ ఎన్నికల్లో కమ్యూనిస్టులతో పొత్తులు పెట్టుకుని పోటీ చేశారు. కానీ ఫలితం అత్యంత దారుణంగా ఉంది. దాంతో.. కమ్యూనిస్టులతో పొత్తు అనే ఆలోచనే చేయడం లేదు. ఇక మిగిలింది తెలుగుదేశం పార్టీ మాత్రమే. తెలుగుదేశం పార్టీతో కలిసి ముందుకు వెళ్లాలనే ఆలోచన.. జనసేన పార్టీ నేతల్లో ఉంది. దీన్ని పవన్ కల్యాణ్ ముందు పరోక్షంగా ఉంచారు.
నిజానికి తెలుగుదేశం పార్టీ.. జనసేనను కావాలని దూరం చేసుకోలేదు. పవన్ కల్యాణే.. గతంలో.. టీడీపీపై అనూహ్యంగా విమర్శలు చేసి తన దారి తాను చూసుకున్నారు. ఎన్నికల సమయంలో.. చంద్రబాబునాయుడు కలసి రావాలని పదే పదే విజ్ఞప్తి చేశారు. కానీ పవన్ కల్యాణ్ మాత్రం సొంతంగానే పోటీ చేశారు. ఫలితం.. ఎలా ఉందో.. అందరికీ తెలిసిందే. ఇప్పుడు.. అలాంటి తప్పు మళ్లీ చేయవద్దని.. స్థానిక ఎన్నికల్లో.. పొత్తులు పెట్టుకుందామనే ఆలోచన.. చేస్తున్నారు. అయితే.. ఇప్పుడు.. టీడీపీ పొత్తులకు సిద్ధంగా ఉందా లేదా.. అన్నది పెద్ద సందేహం. క్షేత్ర స్థాయిలో బలమైన నాయకత్వం ఉన్న పార్టీ టీడీపీ. గ్రామ స్థాయి నుంచి ఆ పార్టీకి పోటీ దారులు ఉంటారు. ఇలాంటి సమయంలో.. క్యాడర్‌కు చాన్సివ్వకుండా.. జనసేనతో పొత్తు పెట్టుకునే చాన్స్ ఉండదంటున్నారు.
మరో వైపు అసలు పవన్ కల్యాణ్ ఏమునుకుంటున్నారన్నది మాత్రం.. ఇంత వరకూ క్లారిటీ లేదు. స్థానిక ఎన్నికల్లో పోటీ చేయాలా వద్దా అన్నదానిపైనా ఆయన ఇంకా నిర్ణయం ప్రకటించలేదు. ఒక వేళ చేయకపోతే ఎలా అనే సమస్య వస్తుంది. కానీ దానికి కొంత కసరత్తు జరగాలి. అలాంటి కసరత్తు జనసేన వైపు నుంచి ఇంత వరకూ ప్రారంభం కాలేదు. అందుకే… జనసేన పార్టీ వ్యవహారాలు గందరగోళంగా ఉన్నాయని.. ఆ పార్టీలో ఉండే చోటామోటా నేతలే గొణుక్కోవాల్సిన పరిస్థితి.