పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన పార్టీలోకి ఈ మధ్య కాలంలో కొంతమంది నేతలు వచ్చి చేరుతున్నారు. నిజానికి, పవన్ తరువాత పార్టీ బాధ్యతలు సమర్థంగా నిర్వహించగలిగే ద్వితీయ శ్రేణి నాయకత్వం ఏదీ అంటే… ఇంకా లేదనే చెప్పాలి. అయితే, రాష్ట్రంలోని 175 స్థానాల్లోనూ జనసేన పోటీ చేసేందుకు సిద్ధమౌతున్న సంగతి తెలిసిందే. కానీ, ఆ స్థాయిలో టీడీపీ, వైకాపాలకు గట్టి పోటీ ఇవ్వగలిగేంత శక్తిమంతంగా ఇప్పుడు జనసేన కనిపిస్తోందా.. అంటే, ఇంకా పూర్తిగా లేదనే సమాధానమే చెప్పుకోవాలి! ఎందుకంటే, ప్రస్తుతం పవన్ కల్యాణ్ కేంద్రంగా మాత్రమే జనసేన పార్టీ కనిపిస్తోంది. టీడీపీ, వైకాపాలకు ఆంధ్రాలో జనసేనే ప్రత్యామ్నాయం అని పవన్ ప్రసంగాల్లో చెబుతుంటారు. వాస్తవిక దృక్పథంతో విశ్లేషించుకుంటే, ప్రజల్లో ఉన్న కొంత ఊపును పూర్తిగా ఓటుగా మార్చుకోగలిగే వ్యవస్థీకృత నిర్మాణం ఇంకా పూర్తిగా జరగలేదన్న పరిస్థితే ఉంది!
పోనీ, ఇప్పటికే పార్టీలోకి వచ్చిన.. లేదా, ఇప్పుడిప్పుడే చేరుతున్న నేతలను గమనిస్తే… వీరంతా గత కొన్నాళ్లుగా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నవారే ఎక్కువ. టీడీపీ, లేదా వైకాపాలో చేరేందుకు రకరకాల కారణాల వల్ల సాధ్యం కానివారే కనిపిస్తున్నారు. కాబట్టి, వీరి చేరికను పార్టీకి అనూహ్యమైన బలాన్ని పెంచే పరిణామంగా చూడలేం. ఇదే తరహాలో టీడీపీ నుంచిగానీ, ప్రతిపక్ష పార్టీ వైకాపా నుంచిగానీ పేరున్న నాయకులు ఆ పార్టీలను వదిలి… జనసేనలో చేరినప్పుడే అసలైన బలం వచ్చిందని అనుకోవచ్చు. అధికార, ప్రతిపక్షాలను కాదంటూ… ఆ పార్టీల నుంచి కొందరైనా జనసేనలోకి చేరితే, జనసేన మూడో ప్రత్యామ్నాయమే అని అప్పుడు చెప్పుకోవచ్చు.
టీడీపీ, వైకాపాల నుంచి ఇప్పటికి జనసేనకు వలసలు అనేవి లేవు! ఉండవనీ చెప్పడం లేదు. దానికీ కొంత సమయం కనిపిస్తోంది. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తరువాత, ఈ రెండు పార్టీల్లోనూ తమకు టిక్కెట్లు దక్కే అవకాశాలు లేవని స్పష్టత వచ్చినవారు… అప్పుడు మూడో ప్రత్యామ్నాయంగా జనసేన వైపు చూస్తారు. ఆ సమయంలో వలసలు కచ్చితంగా ఉంటాయి. అయితే, ఆ సందర్భంలో చేరికలూ కూడికలు ఎన్ని ఉన్నా… అవన్నీ పదవీ కాంక్షతో జరుగుతున్న పరిణామాల కిందే అప్పుడు చూడాల్సి వస్తుంది. అదే, ఎన్నికలకు చాలా సమయం ఉన్న ఈ తరుణంలో… టీడీపీ, లేదా వైకాపా నుంచి కొద్దిమంది పేరున్న నేతల్ని జనసేనాని ఆకర్షించగలిగితే, జనసేనకు మరింత ఊపు తెప్పించే చర్య అవుతుంది. సో… జనసేనకు అసలైన వలసలు ఇంకా మొదలు కావాల్సి ఉంది.