జనసేన పార్టీ వ్యూహాత్మకంగానే రాజకీయ అడుగులు వేస్తున్నట్లుగా కనిపిస్తోంది. బీజేపీపై అసంతృప్తితో ఉన్న సీనియర్ నేత కన్నా లక్ష్మినారాయణ తో నాదెండ్ల మనోహర్ చర్చలు జరిపారు. పైకి వైసీపీ విముక్త ఏపీ కోసం కలిసి పని చేసేందుకు చర్చించుకున్నామని చెప్పుకున్నారు.. కానీ ఇప్పటికే ఆ రెండు పార్టీలు పొత్తులో ఉన్నాయి. కొత్తగా కలిసి పని చేసేదేమీ ఉండదు. మరి ఎందుకు కలిశారన్నదానిపై ఎలాంటి అంశాలు బయటకు రాలేదు.కానీ ఇటీవల కన్నా లక్ష్మినారాయణ చేసిన కొన్ని వ్యాఖ్యలు.. తీసుకున్న నిర్ణయాలను బట్టి చూస్తే..ఆయన జనసేన వైపు చూస్తూండవచ్చన్న ప్రచారం జరుగుతోంది.
వచ్చే ఎన్నికల్లో ఓట్లు చీలనిచ్చే ప్రశ్నే లేదని జనసేన చెబుతోంది. అలా జరగాలంటే టీడీపీతో పొత్తు ఉండాల్సిందే. .బలమైన నేతలు ఉంటే.. కీలకమైన నియోజకవర్గాల్లో పోటీ చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఈ కారణంగా బీజేపీలో ఉన్నా సరే బలమైన నేతల్ని జనసేన వైపు ఆకర్షించవచ్చన్న అభిప్రాయం వినిపిస్తోంది. నాదెండ్ల మనోహర్ అదే ఉద్దేశంతో కన్నా లక్ష్మినారాయణను కలిసినట్లుగా చెబుతున్నారు. కన్నా లక్ష్మినారాయణ కూడా.. జనసేన, టీడీపీ పొత్తు ఉంటే.. ఏదో ఓ పార్టీలో చేరుదామనే ఉద్దేశంలో ఉన్నారు. పొత్తు లేకపోతే జనసేనలో చేరినా కష్టమేనని ఆయన అంచనాగా అనుచరులు చెబుతున్నారు.
ప్రస్తుత రాజకీయాల ప్రకారం చూస్తే.. ఇద్దరి మధ్య పార్టీ మార్పు అంశం చర్చకు వచ్చి ఉంటుందని ఎక్కువ మంది నమ్ముతున్నారు. ఈ భేటీ పవన్ కల్యాణ్ అనుమతితో జరిగిందని.. కన్నా వ్యక్తం చేసిన అభిప్రాయాలను బట్టి.. జనసేన పార్టీ తదుపరి అడుగులు వేసే చాన్స్ ఉందని చెబుతున్నారు. మొత్తంగా.. బీజేపీ నుంచి నేతల్ని చేర్చుకుంటే.. ఆ పార్టీ హైకమాండ్ జనసేన పట్ల ఎలా వ్యవహరిస్తుందనేది ఇప్పుడు కీలకంగా మారింది.