జనసేన పార్టీ ఇప్పుడు ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంది. పార్టీ పెట్టిన తర్వాత తొలి సారి ఘన విజయాల్ని సాధించింది. ఇప్పుడు సంస్థాగతంగా బలపడేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది. ఈ నెల 18 నుంచి జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించారు. 10 రోజులపాటు కొనసాగనున్న నాల్గో విడత సభ్యత్వ నమోదును భిన్నంగా నిర్వహించబోతున్నారు. ప్రతి నియోజకవర్గంలో 50 మంది వాలంటీర్లతో నమోదు ప్రక్రియ నిర్వహిస్తారు పవన్ కల్యాణ్ ఆశయ సాధనకు పని చేయాలని జనసేన పిలుపు ఇస్తోంది.
జనసేన పార్టీకి పవన్ కల్యాణ్ ఫ్యాన్సే బలం. ఆయన అభిమానులందరూ పార్టీ సభ్యత్వం తీసుకుంటూ ఉంటారు. ఇప్పటికి పెద్ద ఎత్తువ సభ్యత్వం ఉంది. వారందరూ మరోసారి రెన్యూవల్ చేసుకోవడమే కాదు.. ఈ సారి అధికారంలో కీలక పాత్ర పోషిస్తున్నందున మరింత ఎక్కువగా సభ్యత్వ నమోదు జరిగే అవకాశం ఉంది. త్వరలో వైసీపీ నుంచి ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాలకు చెందిన నేతలు పెద్ద ఎత్తున జనసేనలోకి క్యూ కట్టే అవకాశం ఉంది., అందుకే ముందుగానే వైసీపీ క్యాడర్ కూడా పార్టీ ఫిరాయించే అవకాశాలు ఉన్నాయి.
జనసేన పార్టీ కార్యకర్తల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తుంది. సభ్యత్వం తీసుకున్న వారికి ఇన్సూరెన్స్ సౌకర్యం కూడా కల్పిస్తుంది. కష్టాల్లో ఉన్న జనసైనికుల్ని ఆదుకోవడానికి నిరంతరం కృషి చేస్తూనే ఉంటుంది. పవన్ కల్యాణ్ ఇప్పుడు కీలక పొజిషన్లో ఉన్నందున జనసేన పార్టీని కింది స్థాయి నుంచి మరింత బలపరిచేలా చర్యలు తీసుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారు.