రాజోలు జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావును పోలీసులు అరెస్ట్ చేశారు. మలికిపురం పోలీసు స్టేషన్‌పై ఎమ్మెల్యే రాపాక.. అనుచరులతో కలిసి దాడి చేశారని.. పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో.. రాజోలు పోలీస్ స్టేషన్లో ఎమ్మెల్యే సరెండర్ అయ్యారు. రాపాకతో పాటు 15 మంది అనుచరులను అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం, విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపణలతో.. రాపాకపై నాన్‌బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. చట్టం ముందు అందరూ సమానమేనని ఏలూరు రేంజ్ డీఐజీ ఖాన్ ప్రకటించారు.ప్రజాప్రతినిధి అయి ఉండి బాధ్యతారాహిత్యంగా పోలీస్‌స్టేషన్‌పై.. దాడికి పాల్పడినందుకు ఎమ్మెల్యే రాపాకపైన , అనుచరులపై కేసు నమోదు చేశామని… ఈ సంఘటన సమాజానికి చెడు సంకేతాలిస్తుందని.. డీఐజీ సందేశం ఇచ్చారు. అయితే.. ఎమ్మెల్యే మాత్రం… ఎస్ఐనే.. తన కణతకు తుపాకీ గురి పెట్టి బెదిరించారని ఆరోపణలు గుప్పించారు. పోలీస్ స్టేషన్లో ఏం జరిగినా.. కేసులు పెట్టారని..చట్టం అందరికీ సమానమన్న డీఐజీ వ్యాఖ్యలు మాత్రం ..చర్చనీయాంశమవుతున్నాయి.
నెల్లూరులో అధికార పార్టీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.. ఓ పత్రిక ఎడిటర్ ఇంటికి వెళ్లి.. దాడి చేసినట్లుగా కేసు నమోదైనా పోలీసులు మాత్రం… ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఆ సందర్భంలోనే ఓ మహిళా డాక్టర్ చేయి పట్టుకుని.. ఇంట్లోకి లాక్కొచ్చరాని ఫిర్యాదులొచ్చినా.. పోలీసులు లైట్ తీసుకున్నారు. అదే సమయంలో… జర్నలిస్టు సంఘాల నుంచి.. ఇతర వర్గాల నుంచి తీవ్రమైన విమర్శలు రావడంతో.. చివరికి పోలీసులు కేసు నమోదు చేశారు కానీ.. ఆ ఎమ్మెల్యేలపై ఎలాంటి చర్యలు తీసుకోవడానికి సాహసించలేదు. గతంలో ఆ ఎమ్మెల్యే నేరుగా పోలీస్ స్టేషన్ పై దాడి చేసిన ఘటనలు కూడా ఉన్నాయి. అదే సమయంలో ఆయన అనుచరులు పట్టపగలు హతాయత్నానికి పాల్పడి పోలీసులకు దొరికిపోయినా.. అది ఎమ్మెల్యే ప్రొద్భలంతోనే జరిగిందని ఆరోపణలు వచ్చినా.. ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పైగా.. ఆయన కార్యాలయానికే పోలీసులు బందోబస్తు కల్పించారు.
విపక్ష పార్టీకి చెందిన ఎమ్మెల్యే విషయంలో చట్టం ముందు అందరూ సమానులేనని చెబుతున్న పోలీసులు… అధికార పార్టీ ఎమ్మెల్యేకు మాత్రం.. ఆ చట్టం మరింత ఎక్కువ సమానమన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఎమ్మెల్యే రాపాకపైనే అనుచితంగా పోలీసులు ప్రవర్తించారని వచ్చిన ఆరోపణలపై.. కనీస విచారణ చేయలేదు కానీ… పోలీసులపైనే దాడికి పాల్పడ్డారంటూ వచ్చిన ఆరోపణలపై మాత్రం.. శరవేగంగా స్పందించారు. అందుకే పోలీసుల పనితీరుపై.. ప్రజల్లో సందేహాలు తలెత్తుతున్నాయి.