జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు తాను పార్టీ మారినట్లుగా అధికారికంగా తెలియ చేశారు. వైసీపీ దీక్షలో పాల్గొని వైసీపీ జెండా కప్పుకుని తాను అచ్చమైన వైసీపీ నేతగా.. ఇతర పార్టీల నేతలపై బూతులు వినిపించారు. గురువారం తన నియోజకవర్గం రాజోలులో వైసీపీ సలహాదారుడు సజ్జల పిలుపునిచ్చిన నిరనస దీక్షలను తన ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రాపాక చాలా రోజుల నుంచి జనసేనను విమర్శిస్తూ.. వైసీపీకి అనుబంధంగా ఉంటున్నారు.
గతంలో పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించబోమని ప్రకటించిన వైసీపీ ఇలా నేతల్ని ఫిరాయింపులకు ప్రోత్సహిస్తున్నారు కానీ పార్టీలో చేర్చుకోవడం లేదు. అలా చేరిన మరుక్షణం అనర్హతా వేటు వేస్తామని అటు జగన్తో పాటు ఇటు స్పీకర్ కూడా పెద్ద పెద్ద మాటలు చెప్పారు. పార్టీలో అధికారికంగా చేర్చుకోలేదు కాబట్టే అనర్హతా వేటు వేయలేదంటున్నారు. అసెంబ్లీలో ఎప్పుడైనా ఓటింగ్ జరిగితే ఆయన వాకౌట్ చేస్తున్నారు. అందుకే ఎప్పుడూ పార్టీ ఫిరాయింపు సాక్ష్యాలు ఇవ్వలేదు.
ఇప్పుడు అత్యాత్సాహంతో పార్టీ కండువా కప్పుకుని మరీ నిరసనలో పాల్గొన్నారు. ఇప్పుడు ఆయనపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. సీఎం , స్పీకర్ ప్రవచించిన విలువల్ని ఇప్పుడైనా పాటించాలని జనసైనికులు డిమాండ్ చేస్తున్నారు. ఇలా వైసీపీ కండువాతో ఉండకూడదని సభకు వచ్చిన వాళ్లుచెప్పడంతో తర్వాత తీసేశారు. కానీ అప్పటికీ దృశ్యాలు సోషల్ మీడియాలోకి వచ్చాయి.