తెలంగాణ మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయడం లేదు. ఇదే మాటను అధికారంగా ఆ పార్టీ ఓ ప్రకటన విడుదల చేసి తేల్చి చెప్పేసింది. ఇదే పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మాటగా ఆయన ప్రతినిధి హరిప్రసాద్ ఒక ప్రెస్ నోట్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఎందుకు పోటీకి దూరంగా ఉంటున్నారయ్యా అంటే… కొన్ని ప్రత్యేక పరిస్థితుల కారణంగా ఉండాల్సి వచ్చిందని ఆ నోట్ లో పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో గ్లాసు గుర్తుపై పార్టీపరంగా తాము పోటీకి దిగడం లేదని స్పష్టం చేశారు. అయితే, ఔత్సాహికులకు పవన్ కల్యాణ్ ఓ బంపర్ ఆఫర్ కూడా ఇచ్చారు!
జనసేన తరఫున పోటీ చేద్దామనుకునేవారు నిరుత్సాహ పడాల్సిన అవసరం లేదనీ, పార్టీ పోటీలో ఉండకపోయినా స్వతంత్ర అభ్యర్థులుగా అభిమానులు నామినేషన్లు వేసుకోవచ్చని పవన్ కల్యాణ్ అనుమతి ఇచ్చారని ప్రకటనలో చెప్పారు! అంటే, జనసేన అభిమానులు ఎవరైనా పోటీకి దిగినా, వారికి జనసేన పార్టీ మద్దతు ఉంటుందన్నమాట. పార్టీ పోటీ చెయ్యదుగానీ, మద్దతు ఇస్తుంది.. అంతే! ఇండిపెండెంట్లుగా నిలబడండి అంటూ ఒక పార్టీ ప్రకటన చేయడం కాస్త కొత్తగానే అనిపిస్తోంది. పార్టీ బరిలో లేనప్పుడు, మరో పార్టీకి మద్దతు ఇవ్వాలని చెప్పాలి. లేదంటే… మీ ఇష్టం అని వదిలెయ్యాలి! ఇంతకీ జనసేన ఎందుకు పోటీ చేయడం లేదో స్పష్టత ఇవ్వలేదు. ఆ అనివార్య కారణాలు ఏంటో చెప్పలేదు.
నిజానికి, జనసేన పార్టీ ఫోకస్ అంతా మొదట్నుంచీ ఆంధ్రప్రదేశ్ మీదే ఉంది. అయితే, ఈ మధ్య తెలంగాణ వ్యవహారాల్లో పవన్ కల్యాణ్ జోక్యం చేసుకోవడం ప్రారంభించాక… ఇటు కూడా జనసేన కార్యాచరణ ఉంటుందా అనే అభిప్రాయం కలిగింది. నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా ఓ రౌండ్ టేబుల్ సమావేశాన్ని పవన్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇతర పార్టీలతో కలిసి జనసేన ముందుకు సాగొచ్చు అనే అభిప్రాయం కనిపించింది. అంతేకాదు, ఆర్టీసీ కార్మికుల సమ్మె తీవ్రస్థాయికి చేరుకున్న సమయంలో కూడా పవన్ స్పందించారు. కార్మికుల సమస్యలపై తాను స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ లను కలుస్తా అంటూ ప్రకటించారు. కానీ, ఆ తరువాత అలా కలిసే ప్రయత్నం చెయ్యలేదు! తెలంగాణలో కేసీఆర్ వ్యతిరేకంగా పవన్ కల్యాణ్ గళమెత్తుతారు అనే వాతావరణం ఈ మధ్య కాస్త కనబడింది. కానీ, తాజా ప్రకటనతో అలాంటిదేం లేదని స్పష్టం చేసేశారు. ఒక రాజకీయ పార్టీ ఎదగాలన్నా, ప్రజల్లో ఉన్నామని సత్తా చాటుకోవాలన్నా ప్రజాస్వామ్య ప్రక్రియలో ఎన్నికల ద్వారానే సాధ్యం. ఇలాంటి అవకాశాలన్ని జనసేన ఒక్కోటిగా వదులుకుంటోందా..? తెలంగాణలో కూడా పవన్ కల్యాణ్ కి పెద్ద సంఖ్యలో అభిమానులున్నమాట వాస్తవం. కానీ, వారికి సరైన వేదిక కల్పించడంలో జనసేనాని ఎందుకో చొరవ చూపడం లేదన్న అభిప్రాయం కలుగుతోంది.