తిరుపతి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసి తీరుతామని.. గెలిచి మోడీకి బహుమతిగా ఇస్తామని ప్రకటనలు చేసిన భారతీయ జనతా పార్టీ నేతలు ఇప్పుడు… ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు. తామే పోటీ చేస్తామని చెప్పడం లేదు. అసలు తిరుపతి వైపు వెళ్లడం కూడా మానేశారు. ఇంత హడావుడి చేసి.. తిరుపతిలో మున్సిపల్ కార్పొరేషన్లో బీజేపీ అభ్యర్థులు పదకొండు అంటే పదకొండు వార్డుల్లో మాత్రమే నామినేషన్లు వేయగలిగారు. బీజేపీ వెనక్కి తగ్గుతున్న సమయంలో… జనసేన ఉత్సాహంగా ముందుకు వస్తుందంటే అదీ కూడా లేదు. తామే పోటీ చేస్తామని ఆ పార్టీ నేతలు ఇప్పటికీ ప్రకటనలు చేయలేదు. నిజానికి జనసేన నేతలు గతంలోనూ చేయలేదు. ఇప్పుడూ చేయడం లేదు.
అయితే.. పవన్ కల్యాణ్ ఢిల్లీ వెళ్లినప్పుడల్లా.. తిరుపతి సీటు తమకు ఇవ్వాల్సిందేనని నడ్డా వద్ద పట్టుబడుతున్నట్లు జనసేన వర్గాలు చెబుతున్నాయి. అయితే బయట మాత్రం.. జనసేన పార్టీ పెద్దగా ఆసక్తి చూపించడం లేదని.. బీజేపీకి ఇవ్వడానికే ఎక్కువ ఆసక్తిగా ఉందన్న ప్రచారం జరిగింది. నిన్నామొన్నటిదాకా రెండు పార్టీలు పోటీపడినట్లు కనిపించినా.. ఇప్పుడు ఎవరికి వారు.. మీరే పోటీ చేయండి.. మీరే పోటీ చేయండి అని ఒకరి మీద ఒకరు తోసుకునే పరిస్థితి ఏర్పడిందంటున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, పెట్రోల్ ధరలు వంటి వాటితో ప్రజలు కేంద్రంపై ఆగ్రహంతో ఉన్నారు.
పైగా జనసేన రాష్ట్ర నాయకత్వం ఏపీ సర్కార్ కు మద్దతుగా ఉంటంది. ఈ పరిణామాలతో పోటీ చేస్తే పరువు పోతుందన్న ఉద్దేశంతో సైలెంట్ గా ఉండటం మంచిదన్న ఉద్దేశంలో ఉన్నట్లుగా చెబుతున్నారు. జనసేన ఇప్పుడు అభ్యర్థి కోసం కసరత్తు ప్రారంభించాల్సి ఉంది. తిరుపతి ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడైనా రావొచ్చని అంచనా వేస్తున్నారు.