కడపలో ఏపీ ప్రభుత్వంపై రాయలసీమ రణ భేరీ అంటూ కొద్ది రోజులుగా హడావుడి చేసిన బీజేపీ సభ సాదాసీదాగా ముగిసిపోయింది. టీడీపీ నుంచి బీజేపీలో చేరిన వారిలో కడప నేతలు ఉండటంతో అక్కడ భారీగా జన సమీకరణ చేయవచ్చని అనుకున్నారు కానీ.. ఓ మాదిరిగా సభను నిర్వహించేశారు. ప్రభుత్వంపై అందరూ రకరకాల విమర్శలు చేశారు. బీజేపీ చైనా, పాకిస్తాన్లకే భయపడలేదని.. ఇసుక, మట్టిదొంగలకు ఎలా భయపడుతుదని సోము వీర్రాజు లాంటి నేతలు పెద్ద పెద్ద డైలాగులు చెప్పారు. రాయలసీమ అభివృద్ధి కావాలంటే డబల్ ఇంజన్ ప్రభుత్వం రావాలనే నినాదం కూడా వినిపించారు. అయితే ఈ సభలో జనసేన ఉనికి ఎక్కడా కనిపించలేదు.
ఇటీవలి కాలం వరకూ బీజేపీ – జనసేన భారీ సభ అంటూ సోము వీర్రాజుకూడా చెబుతూ వస్తున్నారు. రెండు పార్టీలు కలిపి నిర్వహిస్తున్న సభ అని ప్రకటించారు. తీరా చూస్తే కడప సభలో జనసేన ఉనికి ఎక్కడా కనిపించలేదు. మొహమాటానికి అయినా వేదికపై జనసేన ఉనికి కనబడేలా పోస్టర్లు పెడతారేమో అనుకున్నా అదీ జరగలేదు. బీజేపీ ముఖ్యనేతలంతా హాజరైనా.. జనసేన నుంచి కనీసం నాదెండ్ల మనోహర్‌ను అయినా రప్పించలేకపోయారు.
అయితే బీజేపీ పిలిచిందా లేకపోతే.. జనసేన రాలేదా అన్నదానిపై స్పష్టత లేకుండా పోయింది. బీజేపీ రాష్ట్ర నాయకత్వం కలుపుకుని పోవడానికి సిద్ధంగా లేదని.. వైసీపీకి అనుకూలంగా ఉండే రాష్ట్ర నాయకత్వంతో కలిసి పోయేందుకు తాము సిద్ధంగా లేమని.. జనసేన నాయకత్వం భావిస్తున్నట్లుగా కనిపిస్తోంది. బీజేపీ సభ జరుగుతున్న సమయంలోనే నాదెండ్ల మనోహర్ ప్రెస్ మీట్ పెట్టి కాకినాడ ఎమ్మెల్యేపై విమర్శలు గుప్పించారు.
పరిస్థితి చూస్తూంటే బీజేపీ – జనసేన కలిసి నడవడం లేదన్న అభిప్రాయం ఎవరికైనా కలుగుతుంది. పవన్ కల్యాణ్ చెప్పినట్లుగా .. బీజేపీ వైసీపీని గద్దె దించేందుకు ఏదో ఓరోడ్ మ్యాప్ ఇవ్వకపోతే.. జనసైనికులు నిస్సంకోచికంగా బీజేపీకి గుడ్ బై చెప్పే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ లోపు హైకమాంమడ్ కలుగచేసుకుంటే సరి.. లేకపోతే కలిసి నడవడం కష్టమన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది.