జనసేన అధికార ప్రతినిధి అద్దేపల్లి శ్రీధర్ ఇవాళ ఒక టీవీ చానల్ డిబేట్ లో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేన పొత్తు కోసం ఇటు టిడిపి అటు వైఎస్సార్ సీపీపార్టీలు చాలా బలంగా ప్రయత్నిస్తున్నాయని ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి.
తమ తో పొత్తు కోసం టిడిపి వైకాపా పార్టీలకు చెందిన బడా బడా నాయకులు తమ గుమ్మం వద్ద వేచి చూస్తున్నారని, డిబేట్ లో పాల్గొంటున్న చిన్నచిన్న నాయకులకు ఆ విషయాలు తెలియక పవన్ కళ్యాణ్ పై విమర్శలు గుప్పిస్తున్నారు అని, కానీ అదే పార్టీలకు చెందిన బడా నాయకులకు మాత్రం జనసేన ప్రభావం ఎంత బలంగా ఉంటుందో బాగా స్పష్టత ఉందని ఆయన వ్యాఖ్యానించారు. అయితే తమ అధినాయకుడు పవన్ కళ్యాణ్ మాత్రం మొత్తం 175 స్థానాల్లో పార్టీని పోటీ చేసే ఉద్దేశంతో ఉన్నారని, ఇటు తెలుగుదేశం పార్టీతో కానీ అటు వైఎస్సార్సీపీతో కానీ తమకు ఎటువంటి పొత్తు ఉండదని వ్యాఖ్యానించారు.
ఈ రోజే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా పవన్ కళ్యాణ్ ని దువ్వడానికా అన్నట్టు జనసేన టీడీపీ కలిసి పోటీ చేస్తే తప్పేంటి అంటూ పవన్ కళ్యాణ్ పై సానుకూలంగా మాట్లాడిన విషయం తెలిసిందే. (Click here for : బ్రేకింగ్: పవన్ కళ్యాణ్ మాతో కలిసి పోటీ చేస్తే జగన్ కు నొప్పి ఏంటి అన్న చంద్రబాబు) ఏది ఏమైనా, పైకి జనసేన ప్రభావం ఏమాత్రం ఉండదు అని మాట్లాడుతున్న తెలుగుదేశం వైఎస్ఆర్ సీపీ నాయకులు లోలోపల మాత్రం జనసేన తమతో పొత్తుకు వస్తే బాగుంటుందని ఆకాంక్షిస్తున్నట్టు, జనసేన ను కలుపుకుని వెళ్లడానికి శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నట్లు అర్థమవుతోంది.