ఈరోజు ఉదయం తెలుగుదేశం పార్టీ నాయకులు అచ్చెన్నాయుడు ని అరెస్ట్ చేయడం రాజకీయ కలకలం సృష్టించింది. ఈ వ్యవహారంలో జనసేన పార్టీ ఏ విధంగా స్పందిస్తుంది అన్నది కూడా ఆసక్తికరంగా మారింది. 2014లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఒకరకంగా కారణమైన జనసేన పా,ర్టీ 2018 లో ఆ పార్టీతో విభేదించి బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ అరెస్టుపై జనసేన పార్టీ స్పందన ఈ విధంగా ఉంటుందో ఆసక్తి ఉంది. జనసేన పార్టీ తరఫున అధికారికంగా ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ అధ్యక్షుడు నాదెండ్ల మనోహర్ ప్రకటన విడుదల చేశారు.
జనసేన పార్టీ విడుదల చేసిన ప్రకటనలో,
“తెలుగుదేశం పార్టీ నాయకుడు శ్రీ అచ్చెన్నాయుడు అరెస్ట్ అవినీతికి పాల్పడినందుకా లేక రాజకీయ కక్ష సాధింపు కోసమా అన్న విషయంలో వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. అవినీతి ఏ రూపంలో ఉన్నా దానికి బాధ్యులు ఎంతటివారైనా జనసేన తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. అయితే అసెంబ్లీ సమావేశాలకు కేవలం నాలుగు రోజుల ముందు అచ్చన్నాయుడు గారిని అరెస్టు చేయడం సందేహాలకు తావిస్తోంది. అదేవిధంగా ఒక శాసనసభ్యుని అరెస్టు చేసే ముందు రాజ్యాంగ నియమనిబంధనలను పాటించవలసిన అవసరం ఉంది. అచ్చెన్నాయుడు గారి అరెస్టు విషయంలో అది లోపించినట్లు గా కనిపిస్తోంది . ఈఎస్ఐ లో జరిగిన అవకతవకల తోపాటు అన్ని అక్రమాలపై దర్యాప్తు జరిపించాలని జనసేన డిమాండ్ చేస్తోంది” అని పేర్కొంది.
అయితే జనసేన పార్టీ స్పందన ఈ ఒక వర్గానికి వత్తాసు పలికిన విధంగా కాకుండా బ్యాలెన్స్ డ్ గా ఉన్నట్లు అనిపిస్తుంది. వై ఎస్ ఆర్ సి పి ప్రభుత్వం అరెస్టు విషయంలో రాజకీయ నిబంధనలను పాటించకపోవడాన్ని ఎత్తిచూపడం తెలుగుదేశం పార్టీకి కాస్త ఊరట కలిగిస్తే, మిగతా అన్ని అక్రమాలపై కూడా దర్యాప్తు చేయాలని చెప్పడం తెలుగుదేశం పార్టీకి ఇబ్బంది కలిగించే విషయం. మొత్తం మీద రెండు పార్టీలకు సమానదూరం పాటించే మూడవ పార్టీ స్పందన ఏ విధంగా ఉంటుందో ఈ స్పందన అదే రీతిన ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.