జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆదివారం మంగళగిరి పార్టీ ఆఫీసులో పీఏసీ సమావేశం నిర్వహిస్తున్నారు. ఇటీవలి పరిణామాలతో సభ్యులతో విస్తృతంగా చర్చించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అలాగే ఇటీవల పవన్ కల్యాణ్.. చంద్రబాబు మధ్య సమావేశం జరిగింది. చంద్రబాబుతో పవన్ ఫేస్ టు ఫేస్ అరగంట వరకూ మాట్లాడారు. ఈ సమావేశంలో చర్చించిన అంశాలను పవన్.. పీఏసీ ముందు ఉంచే అవకాశం ఉంది. భవిష్యత్ వ్యూహంపై ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
పోలీసులను ప్రయోగించి.. ప్రభుత్వం చేస్తున్న నిర్బంధాలను కలసి కట్టుగా ఎదుర్కోవాలని జనసేన ఇప్పటికే నర్ణయించింది. పవన్ కళ్యాణ్ బస్సు యాత్రను కూడా సజావుగా జరిగేలా సహకరిస్తారని ఆ పార్టీ నాయకులు అనుకోవడం లేదు. అందుకే బస్సు యాత్ర విషయంలో ఎలాంటి వ్యూహం అవలంభించాలి.. పోలీసులు అడ్డుకుంటే ఏం చేయాలన్నదానిపైనా చర్చించే అవకాశం ఉంది. విశాఖలో జరిగిన ఘటనల్లో పూర్తిగా పోలీసులు ఓవరాక్షన్ చేశారని .. వారిపై ప్రైవేటు కేసులు వేయాలని ఇప్పటికే నిర్ణయించుకున్నారు. ఆ కార్యచరణపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
పవన్ ను ఉద్దేశించి వైసీపీ నేతలు,మంత్రులు చేసిన వ్యాఖ్యల పై కూడ చర్చించాలని నాయకులు భావిస్తున్నారు. పవన్ కల్యాణ్‌పై వైఎస్ఆర్సీపీ నేతలు పూర్తిగా వ్యక్తిగత దూషణలకే ప్రాధాన్యం ఇస్తున్నారని జనసేన వర్గాలు అంటున్నాయి. పవన్ వ్యక్తిగత జీవితాన్ని ప్రస్తావిస్తూ.. మూడు పెళ్లిళ్ల అంశంపై ప్రతీ రోజూ ఏదో ఓ కామెంట్ చేస్తున్నారు. అదే సమయంలో ఈ అంశంపై మహిళా కమిషన్ కూడా నోటీసులు ఇచ్చింది. వీటిపైనా చర్చించే అవకాశం ఉంది.