అమరావతి రైతుల పాదయాత్రకు ఒక్క వైఎస్ఆర్సీపీ మినహా అన్ని పార్టీలు మద్దతు తెలిపాయి. వారితో కలిసి ఒక్క సారైనా నడిచి ప్రత్యక్షంగానూ సపోర్ట్ చేశాయి. ఇప్పటి వరకూ అలా ప్రత్యక్షంగా పాల్గొనని పార్టీ జనసేన మాత్రమే. అమరావతికి విస్పష్టంగా మద్దతు ప్రకటిస్తున్న జనసేన పార్టీ ఇంత వరకూ రైతుల పాదయాత్రలో ప్రత్యక్షంగా పాల్గొనలేదు. చివరికి ఆ పార్టీ మిత్రపక్షం అయిన బీజేపీ కూడా పాల్గొంది. అప్పుడు బీజేపీ నుంచి జనసేన నేతలకు ఎలాంటి ఆహ్వానం అంద లేదు. ఇప్పుడు జనసేన స్వయంగా పాల్గొనాలని నిర్ణయించుకుంది.
అయితే పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కాకుండా.. ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పాదయాత్రలో పాల్గొనాలని నిర్ణయించారు. ఇరవై ఆరో తేదీన ఆయన నెల్లూరు జిల్లాలో ఉన్న పాదయాత్రలో జనసేన శ్రేణులతో కలిసి పాల్గొంటారు. మద్దతు తెలియచేస్తారు. టీడీపీ ప్రభుత్వం ఉన్న కాలంలోచివరి ఏడాది అమరావతిపై కుల ముద్ర వేయడంలో పవన్ కల్యాణ్ కూడా కీలక పాత్ర పోషించారు. అయితే వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానులను మాత్రం ఆయన సమర్థించలేదు.
అమరావతి రైతులకే మద్దతు తెలిపారు. అమరావతి రైతుల కోసమే.. తాను బీజేపీతో పొత్తు పెట్టుకున్నానని కూడా ప్రకటించారు. పలుమార్లు అమరావతి రైతుల శిబిరాల వద్దకు వెళ్లి మద్దతు తెలిపారు. కానీ బీజేపీతో పొత్తు పెట్టుకున్న తర్వాత మాత్రం ఆయన సైలెంట్ అయ్యారు. ఇప్పుడు మళ్లీ జనసేన ప్రత్యక్షంగా రైతులకు మద్దతు తెలుపుతోంది. అయితే పవన్ కల్యాణ్ నేరుగా పాల్గొని ఉంటే బాగుండేదన్న అభిప్రాయం రైతుల్లో వినిపిస్తోంది.