జనసేన పార్టీ కార్యాలయాన్ని అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మంగళవారం సాయంత్రం లాంఛనంగా హైదరాబాద్ లో ప్రారంభించారు. భరతమాతకు శాస్త్రోక్తంగా పూజలు చేసి ప్రారంభించారు. వేద మంత్రాల ఘోష మధ్య హితులు, సన్నిహితులు, జనసేన ముఖ్య ప్రతినిధులు అభిమానులు వెంట రాగా కార్యాలయంలో అడుగుపెట్టిన పవన్‌కళ్యాణ్ కార్యాలయంలోని ప్రతి విభాగాన్ని పరిశీలించారు. అనంతరం సర్వమత ప్రార్ధనలు జరిగాయి. పార్టీ పాలనా సౌలభ్యం కోసం ఈ ప్రాంగణం పనిచేస్తుందని, పార్టీ రాజకీయ కార్యకలాపాల కోసం విశాలమైన స్థలంలో హైదరాబాద్, అమరావతి నగరాల్లో పార్టీ కార్యాలయాలను ఏర్పాటు చేస్తున్నట్టు పవన్ కళ్యాణ్ వెల్లడించారు.
తెలంగాణకు చెందిన జనసేన కార్యకర్త నిమ్మల వీరన్న ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నిమ్మల వీరన్న మాట్లాడుతూ , నిస్వార్ధంగా పనిచేసే రాజకీయ నాయకత్వం ఈ దేశానికి అవసరమని, అటువంటి నాయకత్వం రూపకల్పనకు పవన్‌కళ్యాణ్ కృషి చేయాలని కోరారు. దీనిపై స్పందించిన పవన్ మాట్లాడుతూ వీరన్న ను 12 ఏళ్ల క్రితం తొలిసారిగా కలిసినట్టు గుర్తుచేసుకున్నారు. బడుగు వర్గానికి చెందిన వీరన్నను ఏమైనా సాయం కావాలా అని ఒక సారి తాను అడగ్గా ఈ సమాజానికి మీరు మేలు చేయండి అన్న మాటలను ఎన్నడూ మరిచిపోలేనని పేర్కొన్నారు. వీరన్న నిస్వార్ధ సేవకుడని , కాన్షీరాం నుండి ప్రేరణ పొందిన వీరన్న వంటి వారు ఈ సమాజానికి అవసరమని అన్నారు.
ఈ సందర్భంగా ముస్లిం మత పెద్దలు, క్రైస్తవ మత పెద్దలు పవన్ కళ్యాణ్‌ను ఆశీర్వదించారు. అలీ తెలుగులో రాసిన దివ్యఖురాన్ ప్రతిని పవన్‌కు బహుకరించారు. ప్రముఖ పారిశ్రామిక వేత్తలు తోట చంద్రశేఖర్, కెసి వెంకటేశ్వర్లు, కెవికె రావు, న్యాయవాది కె చిదంబరం, సిఎ విశే్వశ్వరరావు, కోళ్ల సుధాకర్, ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, ప్రముఖ నిర్మాత డి సురేష్ బాబు, ఎస్ రాధాకృష్ణ, ఎన్ సుధాకర్‌రెడ్డి, మాటల రచయిత సత్యానంద్, నటులు అలీ, నర్రా శ్రీను, కాదంబరి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.