పవన్ కళ్యాణ్ జనసేన పార్టీతో రాజకీయాలలోకి ప్రవేశించినప్పటికీ, తామరాకు మీద నీటి బొట్టులాగ రాజకీయాలతో అంటీ అంటన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. “ప్రశ్నించడానికే పార్టీ పెట్టానని” చెప్పారు కాబట్టి ఇంతవరకు ఇక ముందు కూడా ఏ ఎన్నికలలో పోటీ చేయకుండా ఆడిన మాట తప్పకుండా అపుడప్పుడు ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తూ అభిమానులకి సంతోషాన్ని, మీడియాకి చేతినిండా పని కల్పిస్తున్నారు. రాజకీయాలతో పెద్దగా ‘టచ్చు’లో లేనప్పటికీ జగన్మోహన్ రెడ్డి కంటే చాలా పరిపక్వత కనబరుస్తున్నారు. పంచె కట్టుకొని విమానం ఎక్కి వచ్చిన పవన్ కళ్యాణ్ ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సమావేశమయ్యారు.
అనంతరం ఆయన “పాము చావకుండా.. కర్ర విరగకుండా” అన్నట్లుగా మీడియాతో చాలా లౌక్యంగా మాట్లాడటం చూస్తే “రాజకీయాలలో ఏక్టివ్ గా లేకపోయినా బాగానే ముదిరిపోయాడే!” అని జనాలు ముక్కున వేలేసుకొనేలా మాట్లాడారు. ప్రత్యేక హోదా విషయంలో ప్రధాని నిర్దిష్టమయిన ప్రకటిన చేసిన తరువాతే తను స్పందిస్తానని చెప్పారు. అంటే ఆయన చెప్పరు..ఈయన ఎన్నడూ స్పందించరని స్పష్టం అయిపోయింది. రాజధాని కోసం ఇంకా మిగిలిన భూములు ఇవ్వని రైతులపై భూసేకరణ చట్టం ప్రయోగిస్తానని ప్రభుత్వం హెచ్చరిస్తోంది. అలాగే విశాఖ ఏజన్సీ ప్రాంతంలో బాక్సైట్ తవ్వకాలకు ఉత్తర్వులు జారీ చేసింది. రెండు చోట్ల అందుకు ప్రభుత్వం తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటోంది. వారి తరపున పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రితో మాట్లాడి ప్రభుత్వ నిర్ణయాలను వెనక్కి తీసుకొనేలా చేస్తారని అందరూ ఆశిస్తే అదేమీ అత్యాశ కాదు. వారి సమస్యలన్నీ ముఖ్యమంత్రికి చెప్పి ఎవరికీ ఇబ్బంది కలగకుండా చూసుకోమని చెప్పానని, అందుకు ఆయన సానుకూలంగా స్పందించారని చెప్పి పవన్ కళ్యాణ్ పక్కా రాజకీయనాయకుడులాగ మాట్లాడారు.
అలాగే వరంగల్ ఉప ఎన్నికలలో బీజేపీ అభ్యర్ధి తరపున ప్రచారం చేస్తానని కానీ చేయనని గానీ చెప్పకుండా ‘ఆలోచిస్తానని’ చెప్పి తను ప్రచారం చేయబోవడం లేదని చాలా స్పష్టంగానే చెప్పారు. ఇక ప్రతీ ఎన్నికలలో జనసేన పోటీ చేస్తుందా…లేదా? అంటూ మీడియాలో వచ్చే ఊహాగానాలకు తెర దించుతూ 2019 ఎన్నికల వరకు ఏ ఎన్నికలలోనూ పోటీ చేయబోమని, అందుకు తన వద్ద తగినంత డబ్బు లేదని మంచి కారణం కూడా చెప్పి కావలసినంత టైం తీసుకొన్నారు. అందుకు ఆయన అభిమానులు నిరాశ చెందినప్పటికీ ఇక వరుసగా సినిమాలలో చేస్తారని స్పష్టం అయ్యింది కనుక అందుకు వారు కూడా సంతోషిస్తుండవచ్చును. ఎన్నికలలో పోటీ చేయడానికి నీతి నిజాయితీలు, అభిమానుల ఆదరణ ఒక్కటే సరిపోవని అందుకు డబ్బులు కూడా కావాలని పవన్ కళ్యాణ్ గ్రహించినట్లే ఉన్నారు. అలాగే కులాల సమీకరణలు కూడా చాలా ప్రధానమని మున్ముందు అంగీకరిస్తారేమో? ఈరోజు ఆయన మాట్లాడిన మాటలను బట్టి అర్ధం అవుతున్నదేమిటంటే, ఇకపై చంద్రబాబు నాయుడు, నరేంద్ర మోడీ ప్రభుత్వాలకి తన వల్ల ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు కలగవని హామీ ఇస్తున్నట్లుంది. ఈ మాత్రం దానికి పంచె ఎగ్గట్టుకొని విమానం ఎక్కి రావడం దేనికో…అని కాంగ్రెస్, వైకాపాలు అప్పుడే ముసిముసి నవ్వులు నవ్వుకొంటున్నాయి.