నిన్న ఒంగోల్ లోని కందుకూరు బహిరంగ సభ వేదికగా పవన్ కళ్యాణ్ పై జగన్ తీవ్ర స్థాయి లో విరుచుకుపడ్డ విషయం తెలిసిందే. పవన్ పై విరుచుకు పడటమే కాదు, ఎన్డీయే ప్రభుత్వం పై లోక్ సభ లో అవిశ్వాస తీర్మానం పెడతామని ప్రకటించి ఆంధ్ర రాజకీయాల్లో కుదుపు తెచ్చిన జగన్ కి పవన్ దీటైన ప్రతి సవాల్ విసిరాడు.
ముందుగా జగన్ నిన్న మాట్లాడుతూ, వైసిపి లోక్ సభ లో అవిశ్వాస తీర్మానం పెట్టడానికి సిద్దంగా ఉందని, దీనికి 54 మంది ఎంపీల మద్దతు కావాలని, మరి పవన్ కళ్యాణ్ – టిడిపి ఎంపీల మద్దతు ఇప్పించే బాధ్యత తీసుకుంటాడా అని సవాల్ చేసాడు. ఆపై రోజా తదితరులంతా పవన్ తక్షణమే స్పందించాలంటూ గళమెత్తారు.
అయితే ఇవాళ అనూహ్యంగా జగన్ సవాల్ కి ప్రతి సవాల్ విసిరారు పవన్ కళ్యాణ్. ముందుగా జగన్ సవాల్ ని తాను స్వీకరిస్తున్నానని ప్రకటించిన పవన్, అవిశ్వాస తీర్మానానికి కావలసింది 54 మంది కాదు 50 మంది అని జగన్ ని సరి చేస్తూ, జగన్ పార్టీ గనక అవిశ్వాస తీర్మానం పెడితే, 50 మంది ఎంపీలని సమీకరించడానికి తాను సిద్దమని అన్నాడు. టిడిపి, టీ ఆర్ ఎస్, కమ్యూనిస్ట్, ఎం.ఐ.ఎం, ఆం ఆద్మీ, తదితర పార్టీలతో తానే స్వయంగా మాట్లాడి మద్దతు కూడగడతానని అన్నాడు. జగన్ కి దమ్ము, ధైర్యం ఉందని తాను నమ్ముతున్నానని, ఖచ్చితంగా ఆయన అవిశ్వాస తీర్మానం పెట్టాలని ప్రతి సవాల్ చేసాడు.
దీంతో డిఫెన్స్ లో పడటం జగన్ వంతైంది. మరి వైసిపి ధైర్యం చేసి అవిశ్వాస తీర్మానం పెడుతుందా? దీనికి వారి ఎంపీలు ఒప్పుకుంటారా? కేసుల భయం తో జగనే వెనక్కి తగ్గుతాడా, లేక కేసులకి వెరవకుండా కేంద్రం పై అవిశ్వాసం పెట్టే (దుస్)సాహసం జగన్ చేస్తాడా అన్నది ఆసక్తికరంగా మారింది.