కొద్ది రోజుల క్రితం.. పవన్ కల్యాణ్ అమెరికా పర్యటనకు వెళ్లి.. వందల కోట్ల బ్లాక్‌మనీని వైట్‌గా చేసుకుని వచ్చారని.. వైసీపీ సోషల్ మీడియా విస్తృతంగా ప్రచారం చేసింది. నిజానికి ఇది చాలా సీరియస్ ఇష్యూ. వెంటనే జనసేన నేతలు.. అటు ఆంధ్రాలోనూ.. ఇటు తెలంగాణలోనూ.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ ఇంత వరకూ… ఆ కేసు విషయంలో అతీగతీ లేదు. అదొక్కటే కాదు.. జనసేన నాయకులపై.. శ్రద్ధాంజలి ఫోటోలు.. అసభ్యరాతలు.. లెక్కలేనట్లుగా వైసీపీ సోషల్ మీడియా విభాగం వారు పెడతారు. పవన్ కల్యాణ్‌ను అత్యంత దారుణంగా ట్రోల్ చేస్తారు. ఎన్ని సార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా… వారు సైలెంట్ అవుతున్నారు కానీ.. ఒక్కరిపై కూడా కేసు పెట్టలేదు.
కానీ.. ప్రభుత్వం తీరును … ప్రజాసమస్యల పట్ల ముఖ్యమంత్రి స్పందనను వ్యతిరేకిస్తూ జనసేన కార్యకర్తలు పోస్టులు పెడితే… ఎవరినీ వదిలి పెట్టడం లేదు. గుంటూరు నుంచి శ్రీకాకుళం వెళ్లి మరీ జనసేన కార్యకర్తల్ని అరెస్ట్ చేస్తున్నారు. ప్రభుత్వాన్ని విమర్శించడం అంటే.. అదేదో పెద్ద నేరమన్నట్లుగా పోలీసులు ప్రత్యేక బృందాలతో రంగంలోకి దిగడం… చూసేవారిని విస్మయం కలిగిస్తోంది. రాజాం నియోజకవర్గం జనసేన కార్యకర్త పనతల హరిని గుంటూరు నుంచి వచ్చి మరీ పోలీసులు అరెస్ట్ అయ్యాడు. సీఎంపై ఫేస్బుక్లో అభ్యంతరకర పోస్టులు పెట్టాడని.. ఆయనపై వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారట. అందుకే పోలీసులు అంతకు మించిన డ్యూటీ లేదననట్లు హుటాహుటిన శ్రీకాకుళం వచ్చి హరిని తీసుకెళ్లారు.
ఇప్పటి వరకూ.. జనసేన కార్యకర్తలపై పదుల సంఖ్యలో కేసులు పెట్టారు. అయినా… ఎవరూ బెదరడం లేదు. అంతకు మించి పోస్టులు పెడుతూనే ఉన్నారు. అయితే.. ప్రభుత్వాన్ని వ్యతిరేకించినంత మాత్రాన కేసులు పెట్టడం ఏమిటన్న చర్చ అంతటా నడుస్తోంది. ఒక్క జనసేన కార్యకర్తల్నే కాదు.. టీడీపీ తో పాటు.. ఇతరులను కూడా ఏపీ పోలీసులు వదిలి పెట్టడం లేదు. అంతగా వారు చేస్తున్నది.. చట్ట వ్యతిరేకమే అయితే… వైసీపీ సోషల్ మీడియా విభాగం కూడా చేస్తున్నది.. చట్ట వ్యతిరేకమే. వారు తమకు స్వేచ్ఛ ఉందన్నట్లుగా వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నా.. పోలీసులు ఎందుకు పట్టించుకోవడం లేదనేది అందరి దగ్గర నుంచి వస్తున్న ప్రశ్న..!