జనసేనాని పవన్ కల్యాణ్ సీరియల్‌గా రిలీజ్ చేస్తున్న ఇంటర్యూ మూడో భాగంలో.. ప్రధానమంత్రి నరేంద్రమోడీని పొగడటానికి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారు. అయితే..ఈ పార్ట్‌లోనూ.. జగన్ పాలనపై విమర్శలు చేయడానికి ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. ముఖ్యంగా.. జగన్ పాలనలో ఇసుక వ్యవహారాలపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. తెలుగుదేశం పార్టీకి తగిలినట్లే… వైసీపీకి ఇసుకదెబ్బ తగలడం ఖాయమని శాపం పెట్టారు. వెబ్సైట్లలో ఇసుక బుకింగ్ రెండు నిమిషాల్లో అయిపోతోందని.. ఎవరికి పోతుందో తెలియడం లేదన్నారు. ప్రభుత్వం తీరు వల్ల సామాన్యుడికి ఇంటి నిర్మాణం భారంగా మారగా.. భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి లేకుండా పోయిందన్నారు. ఇసుక మాఫియాదే రాజ్యం నడుస్తోందని విమర్శించారు. కరోనాపై చేతి వృత్తిదారులు.. స్వర్ణకారులు.. ఫోటోగ్రాఫర్లు, టూరిజం మీదఆధారపడే వారు పూర్తిగా చితికిపోయారని.. వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టలేదన్నారు.
కాపు రిజర్వేషన్ల అంశంపైనా పవన్ భిన్నంగా స్పందించారు. కేంద్రం ఇచ్చిన పది శాతం ఆర్థికంగా వెనుకబడిన వర్గాల రిజర్వేషన్లను… సర్కార్ ఎందుకు అమలు చేయడం లేదని.. ప్రశ్నించారు. కేంద్రం చట్టం చేసినా.. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో కులం వెనుకబడి ఉంటుందన్న కారణంగా.. అమలును రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం వదిలేసిందని.. దాన్ని ఆసరాగా తీసుకుని జగన్ అమలు చేయడం మానేశారని మండిపడ్డారు. టీడీపీ ప్రభుత్వం కాపులకు ఐదు శాతం.. మిగతా అన్ని కులాలకు ఐదు శాతం కేటాయించిందని.. ప్రస్తుత ప్రభుత్వం వాటన్నింటినీ తీసేసిందని.. తక్షణం ఆ రిజర్వేషన్లు కాపులకు మాత్రమే కాకుండా అగ్రవర్ణాల్లో ఉన్న పేదలందరికీ ఈబీసీ రిజర్వేషన్లు వర్తింపచేయాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు.
కరోనా, లాక్ డౌన్ విషయంలో, ప్రజలను ఆదుకునే విషయంలో జగన్మోహన్ రెడ్డి పనితీరును విమర్శించిన … పవన్ కల్యాణ్.. ప్రధానమంత్రి నరేంద్రమోడీకి మాత్రం… వీరతాళ్లు వేశారు. ఆత్మ నిర్భర ప్యాకేజీ…గొప్పగా ఉందన్నారు. దానిపై కొన్ని పార్టీలు ఏదేదో మాట్లాడుతున్నాయి…కానీ లబ్ధి పొందిన వారు నిజంగా మోడీకి చేతులెత్తి నమస్కరిస్తారని చెప్పుకొచ్చారు. ఆ ప్యాకేజీ వల్ల ఎంత మందికి లాభం కలిగిందో కానీ.. ఆ ప్యాకేజీకి నిధుల పేరుతో.. పెట్రోల్ , డీజీల్‌పై రూ. 12కి పైగా పెంచిన విషయాన్ని మాత్రం పవన్ కల్యాణ్ తన ఇంటర్యూలో ప్రస్తావించలేదు. మోడీ అంతర్జాతీయంగా బలమైన నాయకుడని చెప్పుకొచ్చారు. అంతర్జాతీయ విషయాల్లో మోడీ లాంటి నాయకుడు లేకపోతే.. దేశం ఏమైపోతుందో.. అన్నట్లుగా పవన్ చెప్పుకొచ్చారు. చైనాను నిలువరించడాన్ని పెద్ద విజయంగా పవన్ చెప్పుకొచ్చారు.
పనిలో పనిగా జనసైనికులు అద్భుతంగా ప్రజలకు సాయం చేస్తున్నారని… కొన్ని ఉదాహరణలు చెప్పి.. వారిని కూడా పవన్ అభినందించారు. మొత్తానికి పవన్ కల్యాణ్… మూడు భాగాలుగా ప్రత్యేక ఇంటర్యూ రిలీజ్ చేశారు. తన అభిప్రాయాలు నేరుగానే చెప్పారు. కానీ ఇప్పుడు సందర్భం ఏమిటన్నది మాత్రం.. సస్పెన్సే..!