జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రజాపోరాట యాత్రలో భాగంగా ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. మల్కిపురం లో జరిగిన బహిరంగ సభలో ఆయన, కోనసీమలో రిలయన్స్ సాగిస్తున్న ప్రకృతి వనరుల దోపిడీ పై విరుచుకు పడ్డారు. మల్కిపురం సభ లోనే కాకుండా, అమలాపురంలో జరిగిన మీడియా సమావేశంలో కూడా పవన్ కళ్యాణ్ రిలయన్స్ దోపిడి పై విరుచుకు పడ్డారు. రిలయన్స్ కోనసీమ వనరులను దోచేస్తూ, అదే సమయంలో కోనసీమ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోందని వ్యాఖ్యానించారు.
కోనసీమ లో రిలయన్స్ దోపిడి జరుగుతున్న వైనం గురించి:
కోనసీమ ప్రాంతం పచ్చని పైర్లతో ప్రకృతి నిలయం గా అందరూ భావిస్తారని, కానీ ఆ పచ్చని పైరుల కింద పేలి పోవడానికి సిద్ధంగా ఉన్న ఆయిల్ ట్యాంకులు ఉన్నాయని, గ్యాస్ పైప్ లైన్లు ఉన్నాయని , దీంతో కోనసీమ వాసులు ల్యాండ్ మైన్ పై జీవిస్తున్నట్టు గా వారి జీవితాలు మారిపోయాయని, వారి ప్రాణాలకు భద్రత లేదని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. కోనసీమలో తవ్వకాలు జరిపి లక్షల కోట్ల విలువైన చమురు సంపదను తరలిస్తూ రిలయన్స్ కోట్లాది రూపాయలు గడిస్తున్నప్పటికీ ఇక్కడి ప్రజలకు మాత్రం ఉపాధి కల్పించడం లేదని, కనీసం ఇక్కడ సరైన రహదారులు లేవని, ఇదే గ్యాస్ ప్రమాదాల్లో సర్వం కాలి జీవచ్ఛవాల్లా బతుకుతున్న వారికి ఆదుకునే ఆసరా కూడా లేదని అన్నారు.
కోనసీమ ప్రాంతం నుంచి గ్యాస్‌ను తరలించుకుని పోయి మహారాష్ట్ర గుజరాత్ రాష్ట్రాలలో 1800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు కానీ ఇక్కడ ఉన్న గ్యాస్ నుంచి మన రాష్ట్రానికి కేవలం 272 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి కి మాత్రమే గ్యాస్ సరఫరా చేస్తున్నారని వ్యాఖ్యానించిన పవన్ కళ్యాణ్ ఇలాంటి వనరుల దోపిడీ వల్లే ఉద్యమాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. అలాగే 30 అడుగుల లోతు నుంచి వెళ్లాల్సిన పైప్ లైన్లు మూడు అడుగుల లోతులో నిర్మించి, రిలయన్స్ కోనసీమ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతోందని వ్యాఖ్యానించారు పవన్ కళ్యాణ్. కోనసీమలో గతంలో నగరం లో గ్యాస్ దుర్ఘటన గుర్తు చేసిన పవన్ కళ్యాణ్, కోనసీమ లో జరుగుతున్న ఇలాంటి ప్రమాదాలపై ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మీడియాకు చూపించారు.
రిలయన్స్ దోపిడీ పై స్పందించని ముఖ్యమంత్రి జగన్ లపై చురకలు:
ఇంత విచ్చలవిడిగా వనరుల దోపిడీ జరుగుతుంటే ముఖ్యమంత్రి ఎందుకు స్పందించడం లేదని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ముఖ్యమంత్రికి అవినీతి చేయడం, ఆ అవినీతి డబ్బుతో ఎమ్మెల్యేలను కొనడం తప్ప ఇలాంటి సమస్యలు పట్టడం లేదని చురకలంటించారు. ఇక వైఎస్సార్సీపీ అధినేత జగన్ కి రిలయన్స్ దోపిడీని ప్రశ్నించే దమ్ము లేదని పంచ్ ఇచ్చిన జనసేనాని, రిలయన్స్ ని ప్రశ్నిస్తే ఎక్కడ కేంద్రం నుంచి తన కేసుల్లో కదలిక వస్తుందేమోనని జగన్ కి భయం అని ఎద్దేవా చేశారు. గోదావరి జిల్లాల పర్యటన సందర్భంలో కూడా జగన్ రిలయన్స్ దోపిడీపై ఎటువంటి వ్యాఖ్యలు చేయకపోవడం తెలిసిందే. లోకేష్ కి అసలు ఇటువంటి సమస్యలు ఏ మాత్రం పట్టవని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఇవన్నీ చాలక చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో 9 అణు విద్యుత్ కేంద్రాలు ఏర్పాటు చేయడానికి ఎంఓయు లు కుదుర్చుకున్నారని, ఒక్క చెర్నోబిల్ అణు రియాక్టర్ ప్రమాదానికి రష్యా వణికిపోయింది అని, అలాంటప్పుడు, ఏకంగా ఒకే రాష్ట్రంలో 9 విద్యుత్ కేంద్రాల ఏర్పాటుకు ఈ విధంగా అంగీకరిస్తారు అని పవన్ కళ్యాణ్ ప్రభుత్వాన్ని నిలదీశారు.
తమ ప్రభుత్వం వస్తే రిలయన్స్ దోపిడీని అరికడతాం:
తాను ప్రజా సమస్యలపై మాట్లాడడం లో ఎవరికీ భయపడన ని, రిలయన్స్ దేశ ఆర్థిక వ్యవస్థను శాసించగలిగే గ్రూప్ అయినప్పటికీ వారికి భయపడాల్సిన అవసరం తనకు లేదని, తాము అధికారంలోకి రాగానే పైప్ లైన్ లను తిరిగి 30 అడుగుల లోతున పునర్నిర్మించే చర్యలు తీసుకుంటామని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడితే సైన్స్ లేదన్న పవన్ కళ్యాణ్, స్థానిక అవసరాలకు కేటాయించిన తర్వాత గ్యాస్ ఇతర రాష్ట్రాలకు తీసుకెళ్ల గలిగేలా నిబంధనలను విధిస్తామని, తద్వారా రిలయన్స్ యదేచ్ఛగా గ్యాస్‌ను తరలించి వెళ్లకుండా కట్టడి చేస్తామని పవన్ కళ్యాణ్ ప్రకటించారు.
-జురాన్