పవన్ కల్యాణ్ మళ్లీ రంగంలోకి దిగుతున్నారు. బుధవారం నుంచి ఆయన మంగళగిరిలోనే ఉంటూ.. రాజకీయ కార్యకలాపాలాను ఉద్ధృతం చేయనున్నారు. అయితే.. ఇప్పుడు.. బీజేపీ విషయంలో ఆయన వ్యూహం ఎలా ఉందన్నది జనసేన నేతలకూ అంతుబట్టడం లేదు. కేంద్ర పెద్దలతో సన్నిహిత సంబంధాలు ఉన్నప్పటికీ.. రాష్ట్రానికి చెందిన బీజేపీ నేతలపై పవన్ కల్యాణ్‌కు అంత సదభిప్రాయం లేదు. దానికి కారణంగా ఏపీ బీజేపీ నేతల తీరే. జనసేనతో పొత్తు ఉందని.. అవసరానికిమాత్రమే వాడుకుని ఇతర సందర్భాల్లో ఒక్క బీజేపీని మాత్రమే ప్రమోట్ చేసుకుంటున్నారు. కనీసం ప్రజాపోరాటాలకు సిద్ధమైనప్పుడు కూడా జనసేనతో కలిసి పోరాటం చేయాలన్న ఆలోచన చేయడం లేదు. ఇటీవల ఉద్యోగ క్యాలెండర్‌పై బీజేపీ పోరాడింది. కానీ.. జనసేనకు సమాచారం లేదు.
ఏపీ బీజేపీ నేతలు వ్యూహాత్మకంగా జనసేనను నిర్వీర్యం చేసేప్లాన్ అమలు చేస్తున్నారన్న అనుమానాలు పవన్ కల్యాణ్‌లో ఉన్నాయని అంటున్నారు. అందుకే వీలైనంతగా బీజేపీని ఎవాయిడ్ చేసి..సొంతంగా కార్యక్రమాలు చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లుగా చెబుతున్నారు. వాస్తవానికి బీజేపీ- జనసేన ఓ సమన్వయ కమిటీని ఏర్పాటు చేసుకుని ఆ కమిటీ సమావేశాల్లో నిర్ణయాలు తీసుకుని సంయుక్తంగా కార్యాచరణ చేపట్టాలని గతంలోనే నిర్ణయించారు. కానీ ఆ సమావేశాలు చివరి సారిగా ఎప్పుడు జరిగాయో రెండు పార్టీల నేతలకు అసలు అసలు గుర్తుందో లేదో తెలియదు. బీజేపీ తీరు వల్ల జనసేన క్యాడర్‌లోనూ అసంతృప్తి పెరిగిపోతోంది.
స్థానిక ఎన్నికల తర్వాత… తిరుపతి మున్సిపల్ ఉపఎన్నిక తర్వాత బీజేపీ – జనసేన మధ్య గ్యాప్ బాగా పెరిగింది. దీన్ని సరి చేసుకునే ప్రయత్నాన్ని ఏపీ బీజేపీ నాయకత్వం చేయలేదు. ప్రస్తుత బీజేపీ ఏపీ నాయకత్వంలో అధికార పార్టీ సానుభూతిపరులు ఎక్కువగా ఉన్నారు. వీరు ఎవరూ పవన్ కల్యాణ్ మీద సదభిప్రాయంతో ఉన్నట్లుగా కనిపించరు. ఆయన క్రేజ్‌ను వాడుకుని ఏదో తమబలం అన్నట్లుగా చూపించుకుందామని ప్రయత్నిస్తారు కానీ .. నిజంగా ఆయనకు ఇవ్వాల్సినంత గౌరవం ఇవ్వరని అంటున్నారు. ఇప్పుడు అయినా పవన్ కల్యాణ్… అమరావతి వస్తున్నారు. ఆయనను కలిసి.. సంయుక్త పోరాటాలపై చర్చిస్తే.. కాస్త గౌరవం ఇచ్చనట్లు. లేకపోతే.. రెండు పార్టీల మధ్య గ్యాప్ మరింత పెరిగినట్లవుతుంది.