” జాతీయ పార్టీలు రమ్మంటున్నాయి… ఎవరితో కలిసి వెళ్లినా.. లౌకిక పంధాను మాత్రం వీడబోం” … జనసే అధినేత పవన్ కల్యాణ్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ తొలి భేటీలో కీలకంగా చెప్పిన మాట ఇది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ … అమెరికా పర్యటన నుంచి వచ్చిన తర్వాత పొలిటికల్ అఫైర్స్ కమిటీలతో పాటు.. మరికొన్ని కమిటీలను నియమించారు. పీఏసీ మీటింగ్‌లో.. ఆయన చేసిన వ్యాఖ్యలు చాలా మందిని ఆశ్చర్య పరిచాయి. ఎందుకంటే.. పవన్ కల్యాణ్.. అమెరికాలో.. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్‌తో చర్చలు జరిపారు. బీజేపీతో పొత్తుల గురించి ప్రస్తావన వచ్చిన వాళ్లే.. లౌకిక పంథా గురించి మాట్లాడుతూ ఉంటారు. బీజేపీకి ఉన్న ఇమేజ్ అలాంటిది మరి. ఇప్పుడు పవన్ కల్యాణ్ కూడా.. అదే తరహాలో మాట్లాడుతున్నారు. అంటే.. ఆయన బీజేపీతో కలిసి నడవడానికి సానుకూలంగా ఉన్నారన్న సంకేతాలు బయటకు వచ్చినట్లే…!
భారతీయ జనతా పార్టీ మాత్రం.. జనసేన పార్టీని విలీనం చేసుకోవాలనే పట్టుదలతో ఉంది. 2014 ఎన్నికల్లో బీజేపీ – టీడీపీ – జనసేన కూటమి మంచి ఫలితాలను సాధించిన తర్వాత.. భారతీయ జనతా పార్టీ చీఫ్ అమిత్ షా నుంచే.. పవన్ కల్యాణ్‌కు ఆఫర్ వచ్చింది. దేశంలో ప్రాంతీయ పార్టీలకు చోటు లేదని.. జనసేనను తమ పార్టీలో విలీనం చేయాలని ఆ ఆఫర్ సారాంశం. పవన్ కల్యాణ్ చాలా సార్లు ఈ మాట చెప్పారు. అయితే.. తాను అంగీకరించలేదని ప్రకటించారు. అమెరికాలో రామ్‌మాధవ్ కూడా.. ఇదే ప్రతిపాదన పెట్టారని.. పీఏసీ మీటింగ్‌లో పవన్ కల్యాణ్ పరోక్షంగా చెప్పారు. జాతీయ పార్టీలు రమ్మంటున్నాయి కానీ… తాను జనసేనను విలీనం చేసే ప్రసక్తే లేదంటున్నారు.
సాధారణ ఎన్నికల్లో బీజేపీకి ఒక్క శాతం లోపే ఓట్లు రాగా.. జనసేన పార్టీకి ఆరు శాతం ఓట్లు వచ్చాయి. అయితే.. బీజేపీ మాత్రం.. టీడీపీ స్థానాన్ని కైవసం చేసుకోవడానికి వ్యూహాలు పన్నుతోంది. అందు కోసం.. వలసలను ప్రొత్సహిస్తోంది. ఇప్పుడు.. బీజేపీ నేతలు.. తామే ప్రతిపక్షం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. కానీ.. ఏపీలో.. మోడీ మానియా పని చేసే పరిస్థితి లేదు. ఏపీ బీజేపీకి.. జనాకర్షణ ఉన్న ఓ నేత కావాలని బీజేపీ అగ్రనాయకత్వం అంచనా వేస్తోంది. అందుకే పవన్ కల్యాణ్‌ను.. తన పార్టీని బీజేపీలో విలీనం చేస్తే.. పెద్ద పోస్టే ఇస్తామని ఆఫర్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే దీనికి పవన్ కల్యాణ్.. టెంప్ట్ అయినట్లు లేరని… ఆయన మాటలే చెబుతున్నాయి. ఎలా అయినా… బీజేపీతో కలిసి నడిచే విషయంలో పవన్ సానుకూలంగా ఉన్నట్లుగా స్పష్టమవుతోంది.