జనసేన అధినేత పవన్ కల్యాణ్ త్వరలో ప్రజా కోర్టు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఇది మామూలు సభల్లా కాకుండా వినూత్నంగా ఉండే అవకాశం కనిపిస్తోంది. ఏపీలో వైసీపీ నేతలందరూ రాజ్యాంగేతర శక్తులుగా మారారని.. నేరుగాళ్లుగా వ్యవహరిస్తున్నారని జనసేనాని గట్టిగా నమ్ముతున్నారు. రాజారెడ్డి రాజ్యాంగంలో వారిపైనా కేసులు కూడా నమోదు కావడం లేదన్నారు. కానీ వీరెవరూ భారత రాజ్యాంగం నుంచి తప్పించుకోలేరని… ప్రజల ముందు వారికి ఎలాంటి శిక్షలు పడతాయో తెలిపేలా ఈ కార్యక్రమాన్ని ఖరారు చేశారు.
ప్రజాకోర్టు అంటే… నక్సలైట్లు పెట్టినట్లుగా వ్యక్తిని పట్టుకొచ్చి ప్రజల ముందు నిలబెట్టి .. తీర్పు ఇచ్చేసి శిక్ష విధించడం కాకుండా.. .. ప్రజాస్వామ్య పద్దతిలోనే నిర్వహించనున్నారు. తప్పుడు చేసిన ప్రజా ప్రతినిధుల్ని .. ప్రజాకోర్టులో ఏయే చట్టాల కింద వీరికి శిక్ష పడాలి? రాజ్యాంగంలో ఉల్లంఘన ఎలా జరుగుతుంది? అనే దాన్ని ప్రజల ముందు ఉంచనున్నారు. తప్పు జరిగినప్పుడు ప్రతిఘటించాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిది అని పవన్ అభిప్రాయం.
తన సోదరిని వేధిస్తున్నవారిని ప్రశ్నించినందుకు 14ఏళ్ల బాలుడిని హత్య చేసి పెట్రోల్ పోసి తగులబెట్టారని ఇటువంటి దరాగతాలకు పాల్పడేవారిపైనా సరైన కేసులు పెట్టడం లేదన్నారు. రాష్ట్రంలో మహిళలు అదృశ్యం కావడం చాలా పెద్ద విషయం అనీ అయినా ప్రభుత్వం మాత్రం ఏమాత్రం పట్టించుకోకుండా ప్రశ్నించినవారిపై తిరిగి కేసులు పెడుతోందన్న ఆగ్రహం అన్ని చోట్లా కనిపిస్తోంది. జనసేన తరఫున ప్రజాకోర్టు కార్యక్రమం చేపట్టి సామాజిక మాధ్యమాల్లో లేదా ప్రత్యక్షంగా పెట్టే ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రణాళికాబద్దంగా అమలు చేస్తే.. జనసేన ప్రజాకోర్టు.. రాజకీయాల్లో గేమ్ చేంజర్ అయ్యే అవకాశం ఉంది. నేరాలకు పాల్పడిన వైసీపీ నేతలు ఎలాంటి శిక్షలకు అర్హులో ప్రజలే తేల్చే అవకాశం ఉంది.