జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గురువారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని విజయవాడలోని క్యాంప్ కార్యాలయంలో కలువబోతున్నారు. ముఖ్యమంత్రిని కలిసేందుకు నిన్ననే అపాయింట్మెంట్ తీసుకొన్నారని సమాచారం. మూడు నాలుగు రోజుల క్రితం రాజధాని ప్రాంత రైతులు ఆయనను కలిసి తమ కష్టనష్టాలు, ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి పవన్ కళ్యాణ్ చెప్పుకొన్నట్లు తెలుస్తోంది. ఆ తరువాత ఆయన మంత్రి డా. కామినేని శ్రీనివాస్ తో ఈవిషయం గురించి మాట్లాడగా, ఆయన సూచన మేరకు ముఖ్యమంత్రిని కలిసి ఆయనతోనే ఈ విషయాలన్నిటిపై మాట్లాడబోతున్నారని తెలుస్తోంది. అమరావతి నిర్మాణం, కేంద్రం, సహాయసహకారాలు, రైతుల స్థితిగతుల గురించి ముఖ్యమంత్రితో చర్చించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. రాజధాని నిర్మాణం కోసం ఇంకా కొందరు రైతులు భూములిచ్చేందుకు నిరాకరిస్తున్నారు. భూసేకరణ చట్టం ప్రయోగించి వారి నుండి బలవనతంగా భూములు స్వాధీనం చేసుకొంటామని ప్రభుత్వం చెపుతోంది. రైతుల నుండి బలవంతపు భూసేకరణను పవన్ కళ్యాణ్ మొదటి నుండి వ్యతిరేకిస్తున్నారు. బహుశః బలవంతపు భూసేకరణ చేయవద్దని కోరేందుకే ఆయన ముఖ్యమంత్రిని కలుస్తున్నారేమో? ముఖ్యమంత్రితో సమావేశం అనంతరం పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది.