ఆంధ్రప్రదేశ్‌లో పాడైపోయిన రోడ్ల పరిస్థితిని ప్రజల ముందు ఉంచాలని జనసేన నిర్ణయించుకుంది. ఇందు కోసం మూడు రోజుల ప్రణాళిక రూపొందించుకుని కార్యకర్తలకు సూచనలు చేసింది. ఈ మేరకు జనసైనికులు పెద్ద ఎత్తున పాడైపోయిన రోడ్ల దృశ్యాలు, ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. జేఎస్పీ ఫర్ ఏపీ రోడ్స్ అనే ట్యాగ్‌తో పోస్ట్ చేస్తూండటంతో లక్షల సంఖ్యలో అవి కనిపిస్తున్నాయి. మూడో రోజు ప్రారంభం నాటికి దాదాపుగా రెండు లక్షల ట్వీట్లను జన సైనికులు చేశారు.
ఇచ్చాపురం నుంచి అనంతపురం వరకూ అన్ని ప్రాంతాల ప్రజలు తమ ఊళ్లలో రోడ్లు ఎంత దారుణంగా ఉన్నాయో ఫోటోలు సోషల్ మీడియాలో పెడుతున్నారు. రాష్ట్రంలో శిథిలావస్థకు చేరిన రోడ్లను అభివృద్ధి చేయడంలో ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందో సామాజిక మాధ్యమాల్లో ప్రజలు చూపుతున్న వీడియోలు, ఫోటోల ద్వారా వెల్లడవుతోందని జనసేన నేతలు చెబుతున్నారు. అడుగుకో గుంత… గజానికో గొయ్యిలా రాష్ట్రంలో రహదారులు ఉన్నాయని ఫోటోలు, వీడియోలు చూస్తే అర్థం అవుతుందని అంటున్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా ఫోటోలు, వీడియోలు, సమాచారం పంపించడం సాధ్యం కానివారి కోసం 7661927117 అనే నెంబర్ ఇచ్చి వాట్సాప్ ద్వారా పంపించే ఏర్పాట్లను జనసేన చేసింది.
జనసేన ట్వీట్ల ఉద్యమం ట్విట్టర్ ట్రెండింగ్‌లో టాప్ ఫైవ్‌లో నిలిచింది. ప్రస్తుతానికి ఇది డిజిటల్ ఉద్యమంగానే ఉంది. ప్రభుత్వం ఈ దుస్థితిపై స్పందించకపోతే త్వరలో ప్రత్యక్ష కార్యాచరణకు సిద్ధం అవుతారు. జనసేన సొంతంగా శ్రమదానం చేసి రోడ్లను బాగు చేయాలని నిర్ణయించుకుంది. ఇందు కోసం పవన్ కల్యాణ్ కూడా రెండు రోజుల పాటు శ్రమదానం చేస్తానని గతంలోనే ప్రకటించారు. గాంధీ జయంతి రోజుకల్లా రోడ్లను బాగు చేయాలని ప్రభుత్వానికి జనసేన అల్టిమేటం జారీ చేసింది.