జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు హఠాత్తుగా తెలంగాణలో తమ పార్టీ ఉందనే సంగతి గుర్తుకు వచ్చింది. ఎందుకు ఆలోచన వచ్చిందో కానీ… తెలంగాణ వీరమహిళల సమావేశాన్ని ఏర్పాటు చేసి..కేసీఆర్‌కు టైం ఇచ్చానని.. ఆ టైం అయిపోయిందన్నట్లుగా మాట్లాడారు. ఇక తెలంగాణనూ తేల్చుకుంటామన్నట్లుగా ఆయన స్పీచ్ సాగింది. నిన్నగాక మొన్ననే.. గ్రేటర్ ఎన్నికల్లో పోటీకి సిద్ధమని అభ్యర్థుల్ని ప్రకటించి.. తర్వాత బీజేపీ గెలవాల్సిన అవసరం ఉందని గుర్తించి వైదొలిగిన పవన్ నిర్ణయం ఇంకా జనసైనికుల మదిలోనే ఉంది. ఇప్పుడు హఠాత్తుగా బీజేపీని గెలిపించాల్సిన అవసరం లేదని ఎందుకనుకుంటున్నారో.. తన పార్టీని ఎందుకు తెలంగాణలో ముందుకు తీసుకెళ్లాలని అనుకుంటున్నారో చాలా మందికి క్లారిటీ లేదు.
ఇంత వరకూ ఏపీలో వీర మహిళ మీటింగ్‌నే పూర్తి స్థాయిలో పెట్టలేదు. కావాలనే తెలంగాణ వీర మహిళ సమావేశాల్ని పెట్టారని సులువుగానే అర్థమవుతోందంటున్నారు. షర్మిల రాజకీయ పార్టీ అంశం తెలంగాణలో చర్చనీయాంశం అవుతోంది. ఆమె ఎవరో వదిలిన బాణం అని విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఈ తరుణంలో తెలంగాణలో ఇప్పటి వరకూ యాక్టివ్ గా లేని పవన్… ఇప్పుడు ఎప్పుడూ లేనంత కాన్ఫిడెన్స్ చూపిస్తూ తెర మీదకు వచ్చే ప్రయత్నం చేయడం ఆసక్తి రేపుతోంది. పవన్ కల్యాణ్ వెనుక కూడా కొన్ని రాజకీయ పార్టీల వ్యూహం ఉందన్న చర్చ జరుగుతోంంది.
తెలంగాణపై ఆంధ్రా పార్టీల దాడి జరుగుతోందని చెప్పడానికి పవన్ అడుగులు ఉపయోగపడతాయని కొంత మంది అంచనా వేస్తున్నారు. పవన్ తెలంగాణలో పార్టీని యాక్టివేట్ చేయడం వెనుక … ఇతర పార్టీల రాజకీయం వ్యూహం ఉందని ఎక్కువ మంది నమ్ముతున్నారు.