“ఏపీ అంటే అమరావతి పోలవరం, ఆంధ్ర కి పవన్” అంటూ జనసేన అధికార ప్రతినిధి కూసంపూడి శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలపై జనసైనికుల నుంచి హర్షం, ఇతర పార్టీల అభిమానుల నుండి సెటైర్లు వినిపిస్తున్నాయి. అయితే ఢిల్లీలో పవన్ భేటీ అనంతరం, వ్యూహాత్మకంగానే ఈ కొత్త స్లోగన్ మొదలుపెట్టినట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే..
బిజెపి జనసేన ఉమ్మడి వ్యూహం ఖరారు ?
పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన పై రాజకీయ వర్గాలతో పాటు కొన్ని మీడియా వర్గాలు కూడా విపరీతమైన ఆసక్తిని కనబరిచాయి. తిరుపతి సీటు కోసమే పవన్ కళ్యాణ్ పట్టుబడుతున్నాడు అని, బిజెపి ఆ సీటు వదులుకోవడానికి సిద్ధంగా లేదు అని కొన్ని మీడియా వర్గాలు కథనాలు ప్రసారం చేశాయి. తిరుపతి సీటు విషయంలో జరిగిన రచ్చ పెద్దదై, పొత్తు విచ్చిన్నం కొరకు వస్తుందేమోనని కొన్ని వర్గాలు ఆశలు కూడా పెట్టుకున్నాయి. కానీ అక్కడ ఢిల్లీలో జరిగిన చర్చల్లో తిరుపతి ఎంపీ సీటు కంటే ప్రధానంగా అమరావతి పోలవరం అంశాలు ప్రస్తావనకు వచ్చాయి అన్న వార్తలు వారి ఆశలపై నీళ్లు చల్లాయి. పైగా తిరుపతి ఎంపీ సీటు కంటే ప్రధానమైన అంశాలు చర్చల్లో ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. దుబ్బాక విజయంతో తెలంగాణలో దూకుడు మీద ఉన్న బిజెపి, తిరుపతి లో విజయం సాధించడం ద్వారా ఆంధ్రలో కూడా దూకుడు పెంచాలని భావిస్తోంది. తిరుపతి లో విజయం సాధించడంతో పాటు, ఏయే అంశాల తో జగన్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలి అన్న దానిపై సమగ్రంగా చర్చించి, వ్యూహాన్ని ఖరారు చేసినట్లు తెలుస్తోంది.
ప్రధాన ఎజెండాగా మారనున్న అమరావతి, పోలవరం :
జగన్ గెలిచిన తర్వాత కూడా అమరావతి ప్రాంతమే రాజధానిగా ఉంటుంది అని చెప్పి 2019 ఎన్నికల్లో ఓట్లు వేయించుకున్న వైఎస్ఆర్సిపి, ఆ తర్వాత తీసుకున్న 3 రాజధానుల నిర్ణయం వల్ల కృష్ణ గుంటూరు బెల్టులో తీవ్రస్థాయిలో వ్యతిరేకత
ఎదుర్కొంటోంది. ఇటీవల పవన్ అమరావతి రైతులతో భేటీ అయినప్పుడు, అమరావతి రైతుల జేఏసీ కూడా అమరావతి విషయంలో జగన్ మెడలు వంచడం పవన్ – బి.జె.పి కూటమి ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం.
అదేవిధంగా మేము గెలిస్తే 2021లో గా పోలవరం కట్టి చూపిస్తాం అని ప్రగల్భాలు పలికిన వైఎస్ఆర్సీపీ మంత్రులు, తీరా సమయం దగ్గర పడే సరికి, మాకు నిధులు సరిపోవడం లేదు, కేంద్రం నుంచి నిధులు తెచ్చే బాధ్యత సోము వీర్రాజు తీసుకోవాలి, కేంద్రమే దీన్ని టేకప్ చేయాలి అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఇదే వైఎస్ఆర్ సీపీ నేతలు చంద్రబాబు హయాంలో – పోలవరానికి అన్ని నిధులు అవసరం లేదు, చంద్రబాబు ఉద్దేశపూర్వకంగా అంచనాలు పెంచేస్తున్నారు అంటూ కేంద్రానికి రిప్రజెంటేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
ఈ రెండు అంశాల్లో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం విఫలం అయింది అన్న అంశాలను ప్రజల్లోకి గట్టిగా తీసుకెళ్లడం, దానితోపాటు ఇటీవలికాలంలో ఆలయాల విషయంలో జరుగుతున్న దాడులను ప్రజల్లోకి తీసుకెళ్లడం అనే ఎజెండాతో బిజెపి జనసేన కూటమి సిద్ధం అవుతుంది అన్న అభిప్రాయాలు, నిన్నటి పవన్ స్టేట్మెంట్ తర్వాత రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి.
ఏపీ అంటే అమరావతి పోలవరం, ఆంధ్ర కి పవన్ అన్న వ్యాఖ్యలు వ్యూహాత్మకంగా చేసినవే?
ఈ నేపథ్యంలో జనసేన అధికార ప్రతినిధి కూసంపూడి శ్రీనివాస్,” ఏపీ అంటే అమరావతి పోలవరం ఆంధ్ర కి పవన్” అంటూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయి. 2019 ఎన్నికల్లో బిజెపి కానీ జనసేన కానీ కనీస స్థాయిలో కూడా ఓట్లు సాధించకపోవడంతో ఈ స్లోగన్ కి ఇప్పట్లో ప్రజల నుంచి మద్దతు లభించడం కష్టమే అని తెలిసినప్పటికీ, ” రావాలి జగన్ కావాలి జగన్” అని అప్పట్లో వైఎస్సార్సీపీ కార్యకర్తలు, జనాల సబ్ కాన్షస్ లోకి ఎక్కించినట్లు ఇప్పటి నుండే అమరావతి పోలవరం, ఆంధ్ర కి పవన్ అంటూ జనాల కి అలవాటు చేసే ఉద్దేశంతో ఈ స్లోగన్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
పైగా తిరుపతి ఉప ఎన్నికల్లో, వైఎస్ఆర్సిపి మీద ఉన్న వ్యతిరేకతతో పాటు, టిడిపి అభ్యర్థి పనబాక లక్ష్మి కి ఆ ఎన్నిక పై అంతగా ఆసక్తి లేకపోవడం తమకు కలిసి వస్తుందని బిజెపి జనసేన కుటుంబం భావిస్తోంది.సామాజిక సమీకరణాలు కూడా ఈసారి తమకు అనుకూలంగా మారనున్నాయని ఆ కూటమి అంచనా వేస్తోంది. ఒకే ఒక్క దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలవడం తెలంగాణ బిజెపి కి ఎంత బూస్ట్ ఇచ్చిందో, తిరుపతి ఉప ఎన్నికల్లో గెలవడం ద్వారా బీజేపీ జనసేన కూటమికి ఆంధ్రాలో అంతకంటే ఎక్కువ హైప్ వస్తుందని ఆ కూటమి అంచనా వేస్తోంది. ఈ కారణంగానే ఇప్పటి నుండే, ఏపీ అంటే అమరావతి పోలవరం, ఆంధ్ర కి పవన్ అన్న స్లోగన్ ని జనాల్లోకి బలం గా తీసుకెళ్లాలని వీరి కూటమి భావిస్తోంది.
మరి వీరు ఆశించినట్లుగా భవిష్యత్ పరిణామాలు ఉంటాయా అన్నది వేచి చూడాలి.