2019 ఎన్నికలలో ప్రభావం చూపుతుంది అనుకున్న జనసేన పార్టీ ఆశించిన ఫలితాలను సాధించలేకపోవడంతో, జనసేన పార్టీ అభిమానులలో ఒక రకమైన నిస్సత్తువ ఆవరించింది. ప్రజారాజ్యం తో పోలిస్తే, నైతికంగా ఎంతో మెరుగైన రాజకీయాలు చేసినప్పటికీ, ఫలితాలు ప్రజారాజ్యం కన్నా తీసికట్టుగా ఉండడం జనసేన అభిమానులను నివ్వెరపరిచింది. అయితే ఫలితాలు వచ్చి రెండు మూడు వారాలు పైగానే అయింది కాబట్టి, ఇప్పుడు నెమ్మదిగా అటు జనసేన పార్టీ, ఇటు జనసేన అభిమానులు ఎక్కడ పొరపాటు జరిగిందో అంటూ సమీక్షించుకోవడం మొదలుపెట్టారు. అయితే ఈ సమీక్షలు అనేవి, ఎవరికి తోచినట్టు వారు చేస్తూ ఉండడంవల్ల, కొన్ని తప్పుడు కారణాలు కూడా జనసేన అభిమానుల లో ప్రాచుర్యంలోకి వచ్చాయి.
కొంతమంది చెబుతున్న తప్పుడు కారణాలు:
అయితే జనసేన వీరాభిమానులు కొందరు మాత్రం, సోషల్ మీడియాలో (కొన్ని మెయిన్ స్ట్రీమ్ మీడియా వర్గాల్లో కూడా) వస్తున్న కొన్ని ప్రచారాల ఆధారంగా, ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందని గట్టిగా నమ్ముతూ, పవన్ కళ్యాణ్ సైతం ఓడిపోవడానికి అదే కారణమని భావిస్తున్నారు. మరికొందరైతే, డబ్బు మద్యం పంచక పోవడం వల్ల మాత్రమే జనసేనకు ఇలాంటి ఫలితాలు వచ్చాయని, వచ్చే ఎన్నికల్లో గట్టెక్కాలంటే పవన్ కళ్యాణ్ కూడా మిగతా రాజకీయ పార్టీల మాదిరిగానే ఇటువంటి సంప్రదాయక రాజకీయాలు చేయాలని వాదిస్తున్నారు. మరికొందరైతే, వైఎస్ఆర్సీపీ లాగా జనసేన కూడా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తో స్నేహపూర్వక సంబంధాలు కొనసాగించి ఉండాల్సిందని, అప్పుడు యంత్రాంగం కూడా కొద్ది వరకు జనసేన పార్టీకి సహకరించే ఉండేదనే పొరపాటు భావనలో ఉన్నారు. ఇటువంటివన్నీ పొరపాటు అభిప్రాయాలని, పార్టీని ముందుకు తీసుకుపోవడానికి ఇలాంటి సమీక్షలు ఉపయోగపడవని గ్రహించాలి. మరి అసలు కారణాలు ఏమిటి?
సైకిల్ చైన్ తెంపింది మనమే కానీ, ఆ సైకిల్ మన మీదే పడింది :
Click here:
https://www.telugu360.com/te/pawan-kalyan-about-tdp-in-election-campaign/
ఎన్నికలకు ముందు ప్రచారంలో భాగంగా పవన్ కళ్యాణ్ చేసిన ఒక వ్యాఖ్య ఏమిటంటే, “అసలు సైకిల్ చైన్ తెంపిందే మనం” అని. తన ప్రచార కార్యక్రమాల్లో పవన్ కళ్యాణ్ ఎక్కువగా వైయస్ జగన్ అని మాత్రమే టార్గెట్ చేస్తున్నాడని, టీడీపీని టార్గెట్ చేయకపోవడానికి పవన్ కళ్యాణ్ కి టీడీపీ తో ఉన్న లోపాయికారి ఒప్పందం కారణమని విమర్శలు వచ్చిన సమయంలో పవన్ కళ్యాణ్ స్పందిస్తూ ఆ వ్యాఖ్యలు చేశాడు. అయితే ఆ వ్యాఖ్యల లో కొంత నిజం లేకపోలేదు. 2014లో తెలుగుదేశం పార్టీ అధికారం లోకి వచ్చిన నెల రోజుల నుండే వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా అనేక ఆరోపణలు చేస్తూ, నిరసన కార్యక్రమాలు చేపట్టినప్పటికీ, సామాన్య ప్రజానీకంలో అంతగా స్పందన రాలేదు. నంద్యాల ఉప ఎన్నికల్లో వైయస్సార్సీపి పరాజయం కావడం అందుకు నిదర్శనం. కేవలం డబ్బు వల్లే ఉప ఎన్నికలలో టీడీపీ గెలిచింది అనే వాదన కూడా, 2012లో అనేక ఉప ఎన్నికల్లో గెలిచిన వైఎస్ఆర్సీపీ కి తగదు. ఈ లెక్కన , జగన్ ఎన్నో పోరాటాలు చేసినప్పటికీ, 2017 నాటికి ప్రజలలో టీడీపీ పట్ల అంత వ్యతిరేకత రాలేదు అని ఒప్పుకోవాల్సి ఉంటుంది. అయితే 2018 మార్చి 14న పవన్ కళ్యాణ్ అత్యంత తీవ్ర స్థాయిలో తెలుగుదేశం పార్టీ మీద చేసిన విమర్శలు ఆంధ్రప్రదేశ్ ప్రజలను విస్మయానికి గురి చేశాయి. అప్పటివరకు పవన్ కళ్యాణ్ మీద ఉన్న “జెన్యూన్” ఇమేజ్ కూడా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ప్రజలు నమ్మడానికి దోహదం చేసింది.
అయితే ఎన్నికలకు సుమారు ఏడాది ముందే ప్రభుత్వ వ్యతిరేకతను పెంపొందించేలా చేసిన పవన్ కళ్యాణ్, ఆ వ్యతిరేకత తనను కూడా కబళిస్తుందని ఊహించలేకపోయాడు. దానికి కారణం ఆ చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రావడానికి తన మద్దతు కూడా ప్రధాన కారణం గా పనిచేసి ఉండడమే. ప్రజల్లో చంద్రబాబు మీద ఏర్పడ్డ తీవ్ర వ్యతిరేకత జగన్ కి అనుకూలంగా మారింది. దీనికి కారణం, జగన్ కి క్షేత్రస్థాయిలో క్యాడర్ ఉండటం. మొత్తం మీద దీనర్థం ఏమిటంటే, తనకు ఏమాత్రం క్షేత్రస్థాయిలో క్యాడర్ లేకుండా, పార్టీకి పటిష్ట నిర్మాణ బలం లేకుండా ఉన్నప్పుడు ప్రభుత్వం మీద వ్యతిరేకత కలిగేలా చేసినప్పటికీ, దాని ప్రయోజనం క్షేత్రస్థాయిలో బలమున్న రెండవ పార్టీ కి వెళుతుంది అని. బహుశా ఈ కారణం వల్లే, 2014లో ఓడిపోయిన మూడు నెలల నుండే జగన్- బాబు చేసిన తప్పిదాల మీద ప్రశ్నించాల్సింది గా , తిరగబడవలసిందిగా పలుమార్లు పవన్ కళ్యాణ్ ని డిమాండ్ చేసే వారు.
– జురాన్ ( @CriticZuran)
For Part 2:
Click https://www.telugu360.com/te/janasena-review-meeting-about-the-mistakes-done-in-2019-elections-part-2/