జనసేన అధికార ప్రతినిధి అద్దేపల్లి శ్రీధర్ జనసేన పార్టీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. గత ఎన్నికల్లో ఆయన పోటీ చేయలేదు. గతంలో భారతీయ జనతా పార్టీలో ఉన్న ఆయన… ఆ పార్టీ తరపున ఎన్నికల్లో పోటీ చేశారు. జనసేన తరపున పోటీ చేసేందుకు కూడా… ఆయన ఆసక్తి వ్యక్తపరిచారని.. ఆ ఉద్దేశంతోనే.. జనసేనలో చేరారన్న ప్రచారం మొదట్లో జరిగింది. జనసేన తరపున… మీడియాలో వాయిస్ వినిపించడానికి ఎవరూ లేని పరిస్థితుల్లో.. అద్దేపల్లి శ్రీధర్ ఆ బాధ్యతలు తీసుకున్నారు. టీవీ చానళ్లలో.. జనసేన విధానాలను… ప్రజల ముందు ఉంచారు. అయితే ఆయనకు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం దక్కలేదు. శ్రీధర్ ఆసక్తి చూపించలేదో… మరో కారణమో కానీ.. పెద్దగా… చర్చల్లోకి కూడా.. శ్రీధర్ పేరు రాలేదు.
అయితే.. అభ్యర్థుల ప్రకటన తర్వాత కూడా.. అద్దేపల్లి శ్రీధర్.. చురుగ్గానే ఉన్నారు. తనకు పోటీ చేసే అవకాశం రాకపోయినప్పటికీ… ఆయన జనసేన తరపున చర్చల్లో పాల్గొన్నారు. హఠాత్తుగా పోలింగ్ ముగిసిన వారం తర్వాత.. ఆయన రాజకీయాలకు దూరంగా ఉండాలనుకున్నట్లు ప్రకటించారు. దీని వెనుక అసలు కారణం ఏమిటన్నది.. జనసేనలో విస్తృతంగా చర్చలు జరుగుతున్నాయి. పవన్ కల్యాణ్ చుట్టూ ఓ కోటరీ ఉందని.. ఆ కోటరీని దాటుకుని ముందుకెళ్లి పవన్‌కు తన అభిప్రాయాలు చెప్పడం సాధ్యం కావడం లేదన్న ఉద్దేశంతో… అద్దేపల్లి ఉన్నారని అంటున్నారు. పార్టీలో ఏ మాత్రం ప్రాధాన్యం దక్కపోవడంతో.. చివరికి.. ఇలా దూరంగా ఉండాలనే నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.
కొన్నాళ్ల క్రితం.. విజయ్ బాబు అనే అధికార ప్రతినిధి కూడా.. జనసేన పార్టీకి రాజీనామా చేశారు. ఆయన కూడా.. టీవీ చర్చల్లో జనసేన తరపున చురుగ్గా పాల్గొనేవారు. సీనియర్ జర్నలిస్ట్.. పవన్ సామాజికవర్గానికే చెందిన వ్యక్తి కావడంతో ప్రాధాన్యం లభిస్తుందని అనుకున్నారు. కానీ పార్టీలో ప్రాధాన్యం దక్కకపోవడంతో.. ఆయన పార్టీకి గుడ్ బై చెప్పారు. ఆయన ఎన్నికల కంటే ముందుగానే… జనసేనకు రాజీనామా చేసి.. బీజేపీలో చేరిపోయారు. బీజేపీ తరపున చర్చల్లో పాల్గొంటున్నారు. ఇప్పుడు అదే బాటలో జనసేన వాయిస్ వినిపించే అద్దేపల్లి శ్రీధర్ వైదొలిగారు. అయితే శ్రీధర్ రాజకీయ భవిష్యత్ ఏమిటో మాత్రం క్లారిటీ రాలేదు. ఆయన మాతృపార్టీ బీజేపీ కాబట్టి.. అందులో చేరుతారన్న ప్రచారం జరుగుతోంది. కానీ జనసైనికులు మాత్రం… ఆయన జనసేనలోనే ఉంటారని… నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. జనసేనలో… బీజేపీ తరపున డిప్యూటేషన్ పూర్తయిందని.. ఇక మాతృపార్టీలోకి వెళ్తారని.. టీడీపీ అభిమానులు సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు.