ఏపీలో రోడ్ల పరిస్థితిని మూడు రోజుల పాటు సోషల్ మీడియాలో వీడియోలు, ఫోటోల ద్వారా బయట పెట్టాలని జనసేన నిర్ణయించింది. ఈ మేరకు జనసైనికులకు పవన్ కల్యాణ్ ప్రత్యేక సందేశం విడుదల చేశారు. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్ రోడ్ల దుస్థితిపై ప్రభుత్వానికి కనువిప్పు కలిగించాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 2,3,4 తేదీల్లో రోడ్ల దుస్థితిపై ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేయాలని పార్టీ కార్యకర్తలకు సూచించారు. నెలంతా రోడ్ల దుస్థితిపై నిరసన కార్యక్రమాలు నిర్వహించి అప్పటికీ ప్రభుత్వంలో స్పందన లేకపోతే అక్టోబర్ రెంో తేదీ నుంచి తామే శ్రమదానం చేసి రోడ్లను బాగు చేయాలని అనుకుంటున్నారు. స్వయంగా శ్రమదానం చేయాలని పవన్ కల్యాణ్ నిర్ణయించుకున్నారు.
ఈ కార్యక్రమానికి “జేఎస్పీ ఫర్ ఏపీ రోడ్స్” అని పేరు పెట్టారు. అయితే బీజేపీతో పొత్తులో ఉన్న జనసేన.. సొంతంగా కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించింది. బీజేపీని భాగస్వామిని చేసుకోవాలని కూడా ఆలోచించలేదు. అలాగే బీజేపీ కూడా ఎలాంటి ఆసక్తి చూపించలేదు. దీంతో రోడ్ల దుస్థితిపై తామే పోరాటం చేయాలని పవన్ కల్యాణ్ నిర్ణయించుకుని దిశానిర్దేశం చేశారు. పొత్తులో భాగంగా రాజకీయంగా చేపట్టే కార్యక్రమాలను సమన్వయ కమిటీ సమావేశంలో నిర్ణయించుకుని.. కలసికట్టుగా చేయాలని గతంలోనే తీర్మానించుకున్నారు. ఇటీవల మంగళగిరిలోని జనసేన పార్టీ ఆఫీసులో ఈ అంశంపై చర్చలు కూడా జరిగాయి. సమన్వయంతో పోరాడాలని వారు ఒకరికొకరు అనుకున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది.
బీజేపీ కేంద్ర నాయకత్వంపై పవన్ కల్యాణ్ పూర్తి స్థాయిలో సానుకూలతతో ఉన్నారు. కానీ రాష్ట్ర నాయకత్వం విషయంలో మాత్రం ఆయనకు అభ్యంతరాలు ఉన్నట్లుగా చెబుతున్నారు. ఏపీ ప్రభుత్వ పెద్దలతో వారు సన్నిహితంగా ఉంటున్నారని.. పెద్దగా పోరాడటం లేదని పవన్ కల్యాణ్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆయన బీజేపీ హైకమాండ్ దృష్టికి కూడా తీసుకెళ్లారని జనసేన వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి బీజేపీతో కాకుండా జనసేన ఒంటరిగా నిర్ణయం తీసుకుని ప్రజాక్షేత్రంలోకి వెళ్తోంది.