శవాల మీద పేలాలు ఏరుకున్నట్లుగా ఎదిగొచ్చిన కొడుకు చనిపోతే ఆ వృద్ధ తల్లిదండ్రులకు వచ్చిన రూ. ఐదు లక్షల సీఎంఆర్ఎఫ్ సాయంలో రెండున్నర లక్షల వాటా అడిగిన అంబటి రాంబాబు బాధిత కుటుంబానికి జనసేన న్యాయం చేసింది. గుంటూరు దాసరిపాలెంకు చెందిన పర్లయ్య, గంగమ్మలకు జనసేన పార్టీ తరపున నాలుగు లక్షల సాయం అందించారు.
సత్తెనపల్లికి వలస వచ్చి రోడ్డు పక్కన గుడిసె వేసుకుని ఉంటున్నారు. వారికి మైనర్ కుమారుడు ఓ వైసీపీ నేత హోటల్ లో డ్రైనేజీ క్లీన్ చేసే పనికి వెళ్లి ప్రమాదవశాత్తూ చనిపోయాడు. దానిపై గొడవ చేయకుండా ప్రభుత్వ పరిహారం ఇప్పిస్తామని నచ్చ చెప్పారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ. ఐదు లక్షలు మంజూరు చేశారు. ఆ ఐదు లక్షల్లో రెండున్నర లక్షలు తనకు ఇవ్వాల్సిందేనని అంబటి రాంబాబు పట్టుబట్టారు. జనసేన నాయకుల సాయంతో వారు ఈ విషయాన్ని మీడియా దృష్టికి తీసుకెళ్లారు. ఇలా తెచ్చినందుకు ఆ చెక్కును అంబటి రాంబాబు వెనక్కి పంపేశారు.
కుమారుడ్ని కోల్పోయిన ఓ నిరుపేద కుటుంబానికి వచ్చిన పరిహారంలో సగం తాము మింగేయాలని చూడటానికి మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి కూడా ప్రయత్నించడం.. వైసీపీ ప్రభుత్వంలో ఉన్న దారుణమైన .. భయంకరమైన లంచాల వ్యవస్థకు అద్దం పడుతోంది. నిరుపేదల్ని సైతం పీల్చి పిప్పి చేస్తున్నారు. శవాల మీద పేలాలు ఏరుకునేందుకూ వెనుకాడటం లేదు. చివరికి విషయం బయటపడినా ఏ మాత్రం వెరపు లేకుండా.. ఆ సాయం వెనక్కి పంపేయడం… వారి పాషాణ హృదయాలకు నిదర్శనమన్న ఛీత్కరింపులు వైసీపీకి వస్తున్నాయి. వారికి జరిగిన నష్టాన్ని జనసేన భర్తీ చేసి ఆదుకుంది.