ఏపీలో మిగిలిపోయిన స్థానిక సంస్థలు, కార్పొరేషన్ల ఎన్నికలకు ఎప్పుడైనా షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది. నవంబర్ ఒకటిన ప్రారంభించి పదిహేనో తేదీలోపు పూర్తి చేసి ఆ తర్వాత అసెంబ్లీ సమావేశాలకు వెళ్లాలని సీఎం జగన్ భావిస్తున్నారు. దానికి తగ్గట్లుగానే ఎన్నికలు జరగాల్సిన చోట రాజకీయ పార్టీలు తమ సన్నాహాలు చేసుకుంటున్నాయి. ఆశావాహులు రంగంలోకి దిగిపోతున్నారు. ఈ సందడి నెల్లూరులో ఎక్కువగా ఉంది. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరగాల్సి ఉంది. అక్కడ జనసేన పార్టీకి మంచి బలం ఉంది. ప్రజారాజ్యం సమయంలో నెల్లూరు రూరల్ నుంచి ఓ ఎమ్మెల్యే గెలిచారు కూడా.
అందుకే సహజంగానే జనసేన పార్టీకి అక్కడ బలం.. బలగం ఉంది. అక్కడ బీజేపీ నేతలూ కాస్త హడావుడి చేస్తూంటారు. కేడర్ ఉన్నా లేకపోయినా నేతలు మాత్రం ప్రముఖులుగా చెలామణి అవుతూంటారు. ఇప్పుడు కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు అవసరం లేదని.. ఒంటరిగా పోటీ చేయాలని జనసేన ఏకపక్షంగా నిర్ణయించేసుకుంది. దీంతో షాక్ తినడం బీజేపీ నేతల వంతయింది. ఇప్పటికే బద్వేలు విషయంలో జనసేన పార్టీ బీజేపీని లెక్కలోకి తీసుకోకపోవడంతో వారి మధ్య గ్యాప్ పెరిగిపోయినట్లయింది.
తాజాగా స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ బీజేపీని దూరం పెట్టాలని నిర్ణయించుకోవడంతో ఆ రెండు పార్టీల పొత్తుపై సందేహాలు ప్రారంభమయ్యాయి. స్టీల్ ప్లాంట్ వ్యతిరేక ఉద్యమంలోకి దిగాలని పవన్ నిర్ణయించుకోవడం… బీజేపీకి దూరంగా జరుగుతూండటం… పవన్ తన రాజకీయ పయనాన్ని భిన్నంగా నిర్వహించాలన్న ఆలోచనలో ఉన్నట్లుగా స్పష్టత నిస్తోందని భావిస్తున్నారు.