అమరావతి విషయంలో జనసేన పార్టీ తన విధానాన్ని నేరుగా హైకోర్టుకు అఫిడవిట్ రూపంలో తెలియ చేసింది. మూడు రాజధానులు వద్దే వద్దని అమరావతి మాత్రమే రాజధానిగా ఉండాలని సూటిగా జనసేన స్పష్టం చేసింది. రాజధాని అంశంలో రాజకీయ పార్టీలు మాట మార్చాయంటూ కొద్ది రోజుల కిందట హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిని విచారించిన హైకోర్టు అన్ని రాజకీయ పార్టీలకు నోటీసులు జారీ చేసింది. అన్ని పార్టీలకూ కౌంటర్ దాఖలు చేసే అవకాశం ఇచ్చింది. దీంతో జనసేన కూడా కౌంటర్ దాఖలు చేయాలని నిర్ణయించుకుంది.
ఈ మేరకు పార్టీ నేత తమ్మిరెడ్డి శివశంకర్ రూపొందించిన అఫిడవిట్‌ను పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆమోదంతో లాయర్ చల్లా అజయ్ కుమార్ కోర్టులో దాఖలు చేశారు. ‘రాష్ట్రానికి ఉన్న బాధ్యతలను రాజధాని కోసం భూములిచ్చిన రైతుల హక్కులను, రాష్ట్ర ప్రజలకి రాజధానిపై ఉండే హక్కులను జనసేన పార్టీ ఆలోచన విధానాన్ని అఫిడవిట్ ప్రతిబంబిస్తుందని జనసేన పార్టీ ప్రకటించింది. గత వారం కాంగ్రెస్ పార్టీ తన అఫిడవిట్‌ను హైకోర్టులో సమర్పించింది. కాంగ్రెస్ పార్టీ కూడా అమరావతినే రాజధానిగా ఉండాలని … మూడు రాజధానులు తప్పుడు నిర్ణయమని అఫిడవిట్లో పేర్కొన్నారు. ఇప్పుడు జనసేన కూడా అదే బాటలో నడిచింది. జనసేన పార్టీ మొదటి నుంచి మూడు రాజధానులకు వ్యతిరేకంగా ఉంది.
జగన్ .. ఎన్నికల సమయంలో మూడు రాజధానులు పెడతానని చెప్పలేదు కాబట్టి.. నమ్మక ద్రోహం చేసినట్లేనని పవన్ కల్యాణ్ విమర్శలు చేస్తున్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ చేయాలి కానీ పాలనా వికేంద్రీకరణ కాదంటున్నారు. ఈ మేరకు పవన్ అభిప్రాయాలకు తగ్గట్లే అఫిడవిట్ దాఖలు చేశారు. నిజానికి ఏపీలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు అమరావతినే రాజధానిగా ఉండాలని అంటున్నాయి. తమ విధానాన్ని బహిరంగంగానే చెప్పాయి. ఒక్క వైసీపీ మాత్రమే.. ఎన్నికల ముందు వరకూ అమరావతి రాజధాని అని.. ఎన్నికల తర్వాత మూడు రాజధానులనే విధానాన్ని మార్చుకుంది.