జనసేన పార్టీ నుంచి కేతంరెడ్డి వినోద్ రెడ్డి అనే నెల్లూరు నేతను సస్పెండ్ చేశారు. నియోజకవర్గ ఇంచార్జ్ ను జిల్లా అధ్యక్షుడు సస్పెండ్ చేసేశారు. దీనిపై జనసేన అగ్రనేతలు ఎవరూ స్పందించలేదు. అదే సమయమంలో జనసేనలో చేరుడానికి సిద్ధమైన మహాసేన రాజేష్.. తనను ఎవరూ సంప్రదించలేదని.. తనను టీడీపీ నేతలు పిలిచారని… ఆ పార్టీలోకి వెళ్తున్నానని ప్రకటించారు. దీంతో అసలు జనసేనలో ఏం జరుగుతోందన్న చర్చ జన సైనికుల్లో కనిపిస్తోంది.
గత ఎన్నికల్లో జనసేన ఓడిపోయిన తర్వాత నియోజకవర్గాల్లో పోటీ చేసిన వారు అడ్రస్ లేకుండా పోయారు. కొంత మంది మాత్రమే అంటిపెట్టుకుని పని చేస్తున్నారు. ఇలాంటి వారిలో విజయవాడలో పోతిన మహేష్ అయితే.. నెల్లూరులో కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఒకరు. ఆయన ఆర్థిక వనరులు అంతంతమాత్రంగానే ఉన్నా.. జనసేన బలోపేతం కోసం పని చేస్తున్నారు. ప్రతీ రోజూ ఏదో ఓ కార్యక్రమం చేపడుతున్నారు. ఆయన పేరు సోషల్ మీడియాలో జనసైనికులదంరికీ తెలుసు. హఠాత్తుగా ఆయనను సస్పెండ్ చేస్తున్నట్లుగా ప్రకటించడం సంచలనం అవుతోంది.
పార్టీలో నేతల మధ్య ఆధిపత్య పోరాటం సహజం . అలా ఘర్షణలు జరుగుతూ ఉంటాయి. అలా కేతంరెడ్డి వర్గీయులకు.. ఇతర వర్గానికి గొడవ జరిగింది. దీంతో కేతంరెడ్డిని సస్పెండ్ చేసేశారు. దీనిపై హైకమాండ్ కూడా జోక్యం చేసుకోకపోవడం.. చాలా మందిని విస్మయపరుస్తోంది. ఎంత పని చేసినా ఇదే పరిస్థితా అని.. పని చేసే నేతల్ని చూసి నిరాశకు గురవుతున్నారు.