ఎన్డీఏలో టీడీపీ, జనసేన చేరాయి. చాలా రోజులుగా ఈ చర్చలు ఉన్నా… చివరికి ఎన్నికల షెడ్యూల్ కు ముందు ఫైనల్ అయింది. అసలు బీజేపీతో పొత్తు ఎందుకు అన్నది టీడీపీ, జనసేన కింది స్థాయి క్యాడర్ కు ఇంకా అర్థం కావడం లేదు. ఎందుకంటే బీజేపీకి కనీస బలం లేదు. ఒక్క నియోజకవర్గంలోనూ నోటాను దాటలేరు. మరి ఆ పార్టీతో పొత్తు వల్ల ప్రయోజనమేంటి అనేది వారి డౌట్. అయితే ఓట్ల పరంగానే కాదు.. ఇప్పుడు బీజేపీతో చేయదగ్గ పనులు కూడా ఉన్నాయి. ఆ ప నులు చేస్తారన్న ఆశతోనే బలం లేకపోయినా సీట్లు ఇచ్చి పొత్తులు పెట్టుకున్నారు. ఆ పొత్తు ధర్మాన్ని ఇప్పుడు బీజేపీ పాటించాల్సి ఉంది.
అధికారం అరాచకాల్ని అడ్డుకోవడం !
ఏపీలో వ్యవస్థలు ఎలా పని చేస్తున్నాయో అందరికీ తెలుసు. ఆ వ్యవస్థలు ఇప్పటికిప్పుడు కూటమి వైపు మారాలని ఎవరూ కోరుకోరు కానీ.. నిష్ఫాక్షికంగా పని చేయాలని మాత్రం కోరుకుంటారు. బీజేపీ చేతిలో అధికారం ఉంది. ఈ విషయంలో… వ్యవస్థల్ని సక్రమంగా పని చేసేలా చేయడంలో బీజేపీ పాత్ర కీలకం. ముఖ్యంగా ఎన్నికలసంఘం. ఎన్నికల సంఘం ఎంత కరెక్ట్ గా పని చేస్తే…. చేసేలా చేయగలిగితేనే బీజేపీ అంత పర్ ఫెక్ట్ గా పొత్తు ధర్మం పాటించినట్లు అవుతుంది.
ఈ రెండు నెలలు అయినా అడ్డగోలుగా అప్పులు ఇవ్వకపోవడం !
గత ఐదేళ్లుగా రాష్ట్రం అప్పుల ఊబిలోకి కూరుకుపోవడానికి … కారణం కేంద్ర సహకారమే. బీజేపీకి అవసరం ఉన్నా లేకపోయినా జగన్… మోదీకి మద్దతుగా ఉంటూ వస్తున్నారు. రాజ్యసభలో ఉన్న బలం జగన్ ప్లస్ అయింది. హోదా అడగలేదు.. పోలవరాన్ని పట్టించుకోలేదు… అయినా అప్పులు ఇస్తే చాలన్నట్లుగా జగన్ పాలన సాగింది. బీజేపీ సహకరించింది. ఇప్పుడు ఎన్నికలకు ముందు అలాంటి సహకారం ఇవ్వకుండా ఉండటం కూడా పొత్తు ధర్మంలో భాగమే అనుకోవచ్చు.
కూటమి భారీ విజయానికి అవసరమైన సాయం చేయడం !
బీజేపీ జాతీయ స్థాయిలో బలంగా ఉంది. ఈ క్రమంలో కూటమి భారీ విజయానికి తన వంతుగా బీజేపీ సాయం చేయాల్సి ఉంది. ఇప్పటి వరకూ జగన్ పై చూపిన అభిమానాన్ని పక్కన పెట్టి… అసలైన రాజకీయం చేయాల్సి ఉంది. సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నట్లుగా.. వైసీపీ పై అభిమానాన్ని కొనసాగించి.. చూసీ చూడనట్లుగా పోతే.. అంతకన్నా పొత్తు ద్రోహం ఉండదు. ఇవన్నీ బీజేపీపై టీడీపీ, జనసేన క్యాడర్ లో ఉన్న సందేహాలు. వాటిని తీర్చాల్సింది బీజేపీ తీసుకునే నిర్ణయాలే.