తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమిగా ఏర్పడ్డాయి. సీట్ల ప్రకటన కూడా చేసుకున్నారు. ఇరవై నాలుగు సీట్లు జనసేనకు ప్రకటించినప్పటి నుండి ఓ రకమైన ప్రచారం జరుగుతోంది. జనసేన పార్టీ పేరుతో కొంత మంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పవన్ కల్యాణ్ పార్టీని అమ్మేశాడని అంటున్నారు. ఇదంతా వైసీపీ వాయిస్. అధికార వైసీపీ నేతలు మరింత ఎక్కువగా విమర్శలు చేస్తున్నారు. ఇరవై నాలుగు సీట్లకు అమ్ముడుపోయారని.. మరొకటని విమర్శలు చేస్తూ ఉన్నారు. ఆ ఫ్లోలో కొంత మంది జనసేనకు చెందిన సోషల్ మీడియా కార్యకర్తలు కూడా పవన్ కళ్యాణ్ ను ప్రశ్నిస్తూ ఆయనకేమీ రాజకీయం తెలియదన్నట్లుగా కామెంట్స్ చేస్తున్నారు. సలహాలు ఇస్తున్నారు. ఈ గందరగోళంతో ఓటు ట్రాన్స్ ఫర్ కాదని బెదిరించే వాళ్లు కూడా ఉన్నారు. వీరందరికీ .. తాడేపల్లి గూడెం సభ ఓ స్పష్టత ఇచ్చింది. ప్రజల్లో పెరుగుతున్న గందరగోళాన్ని వేర్లతో పీకేసింది.
పరస్పరం సమన్వయంతో ప్రజలకు స్పష్టమైన సందేశం
తాడేపల్లిగూడెం సభలో పవన్, చంద్రబాబు… తమ మధ్య ఎలాంటి రాపో ఉందో చూపించారు. ఎక్కడా అనుమానాలు…సందేహాలకు చోటు లేదని స్పష్టం చేశారు. ఎలాంటి త్యాగాలకైనా సిద్ధమని కూడా చెప్పారు. ఈగోలు అసలు పెట్టుకోలేదు. సహజంగా ఆ సభలో ముఖ్య నేత చివరిలో మాట్లాడతారు. ఆయన మాట్లాడితే స్పీచ్ అయిపోతుంది. వచ్చిన వాళ్లు వెళ్లిపోతారు. కానీ తాడేపల్లిగూడెం సభలో చంద్రబాబు పవన్ కంటే ముందే మాట్లాడారు. ఉమ్మడి సభ అయినా .. యాక్టివ్ పార్ట్ తీసుకుంది జనసేన. అందుకే చంద్రబాబు ఓ మెట్టు దిగి.. చివరిలో ప్రసంగించే గౌరవాన్ని పవన్ కల్యాణ్‌కే ఇచ్చారు. ఇది చాలా మందిని ఆకర్షించింది. పవన్ కల్యాణ్‌కు చంద్రబాబు అత్యున్నత గౌరవం ఇస్తారని క్లారిటీ వచ్చింది.
ఒకరినొకరు అభినందించుకున్న చంద్రబాబు, పవన్
అదే సమయంలో తన ప్రసంగంలో పవన్ కల్యాణ్ ను పొగిడారు. రాష్ట్రం కోసం తాము కలిసిన వైనాన్ని వివరించారు. పవన్ కల్యాణ్ కూడా అదే విధంగా స్పందించారు. తమ పార్టీకి లేని సంస్థాగత బలాన్ని చెప్పడానికి ఏ మాత్రం వెనుకాడలేదు. టీడీపీ బలాన్ని గుర్తించారు. కలిసి పోరాడాల్సిన అవశ్యకతను వివరించారు. చంద్రబాబు సమర్థతను.. సీనియారిటీని వివరించారు. మొత్తంగా ఓ అద్భుతమైన సమన్వయం తమ మధ్య ఉందన్న సందేశాన్ని పంపారు.
ఓటు ట్రాన్స్ ఫర్ జరగదని చేస్తున్న కుట్రలకు చెక్
పొత్తుల్లో ఓటు ట్రాన్స్ ఫర్ అనేది అత్యంత కీలకం. జనసేన ఓట్లు టీడీపీకి.. టీడీపీ ఓట్లు జనసేనకు బదిలీ అయితే.. ఏకపక్ష విజయాలు వస్తాయన్న విశ్లేషణ ఉంది. కానీ రెండు పార్టీల మధ్య తేడాలు ఉంటే మాత్రం.. కాస్త గ్యాప్ వస్తుంది. ఓటర్లలో కూడా .. మన ఓటు మరో పార్టీకి వేయడం ఎందుకన్న ఆలోచన వస్తుంది. అలాంటి ఆలోచనల్ని మొగ్గలోనే తుంచేయడానికి రెండు పార్టీలు అద్భుతమైన స్ట్రాటజీని ఉపయోగించాయి. తాడేపల్లి గూడెం సభలో అమలు చేశాయి. తనను వ్యతిరేకించేవారు తమ వారు కాదని పవన్ తేల్చి చెప్పడం ద్వారా.. క్లియర్ మెసెజ్ పంపేశారు. మొత్తంగా తొలి అడుగును కూటమి పర్ ఫెక్ట్ గా వేశాయని అనుకోవచ్చు.