తెలంగాణలో బీజేపీతో పొత్తే ఉండదని తేల్చేసిన జనసేన సొంతంగా పోటీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంది. అన్నింటిలోనూ కాదని.. బలమున్న కొన్ని నియోజకవర్గాల్లో పోటీచేయాలని డిసైడ్ చేసుకుంది. ఇందు కోసం 32 నియోజకవర్గాలను ఫైనల్ చేసుకుని వాటికి ఇంచార్జులను ప్రకటించారు. ఈ ఇంచార్జులు వారికి కేటాయించిన నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. తర్వాత వారు అధిష్ఠానానికి నివేదిక అందజేయనున్నారు. ఆ రిపోర్టు ఆధారంగానే పోటీ చేసే అభ్యర్థులను ప్రకటిస్తామని జనసేన కీలక నేతలు చెబుతున్నారు.
రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో జనసేన పోటీలో నిల్చుంటుందని పవన్ కల్యాణ్ పదే పదే చెబుతున్నారు. అయితే ఆ దిశగా కసరత్తు జరుగుతోందా లేదా అన్నదానిపై స్పష్టత లేదు. తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వచ్చే చాన్స్ ఉందని ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో ముందస్తు లేకపోయినా మరో పది నెలల్లో ఎన్నికలు జరగాల్సి ఉంది. అందుకే పవన్ కల్యాణ్… ఫ్యాన్ బేస్.. సామాజికవర్గం కలిసి వచ్చే 32 నియోజకవర్గాలను ఎంపిక చేసుకుని రంగంలోకి దిగుతున్నారు.
గతంలో బీజేపీతో పొత్తు కారణంగా జనసేన పార్టీ ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఓ సారి బీజేపీతో పొత్తు లేకపోయినా పోటీ చేయలేదు. గ్రేటర్ ఎన్నికల్లో అభ్యర్థుల్ని ప్రకటించి.. బీజేపీ అడిగిందని.. వెనక్కి తగ్గారు. కానీ బీజేపీ నేతలు అవమానకరంగా మాట్లాడటంతో … వారితో బంధం తెగదెంపులు చేసుకున్నారు. కానీ ఏపీలో మాత్రం అధికారికంగా వారి మధ్య పొత్తు కొనసాగుతోంది. దీంతో తెలంగాణలోనూ ఉంటుందనుకున్నారు. కానీ అలాంటిదేమీలేదని తేలిపోయింది. తెలంగాణలో జనసేనతో పొత్తుకు బీజేపీ కూడా ఆసక్తి చూపడం లేదు.