తిరుపతి ఉపఎన్నిక సీటు విషయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఆవేశ పడకుండా.. పనులు చేసుకెళ్లిపోతున్నారు. బీజేపీ నేతలు ముందస్తుగా చేసిన ప్రకటనలతో కంగారు పడకుండా.. సైలెంట్‌గా.. ఎవరి బలం ఎంతో తూకం వేయించి.. బీజేపీ హైకమాండ్‌కు.. ప్లస్‌లు.. మైనస్లతో నివేదిక పంపారు. అంతే కాదు.. బీజేపీ నేతల అత్యుత్సాహ ప్రకటనలు.. అందులో నడ్డాను.. పవన్ కల్యాణ్‌ను కలిపిసి.. వారు చెప్పినట్లుగా ప్రకటించడం వంటి విషయాలను కూడా ఆ నివేదికలో పొందు పరిచినట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా పదవి వచ్చిందన్న ఉత్సాహమో.. లేకపోతే.. తనకు మాత్రమే తెలిసిన రాజకీయమో కానీ.. సోము వీర్రాజు.. చెలరేగిపోతూండటం.. మిత్రపక్షాన్ని చులకన చేస్తూండటం… ఓ వర్గం బీజేపీ నేతల పట్ల ఆయన దారుణంగా వ్యవహరిస్తూండటం వల్ల… ఏర్పడుతున్న పరిస్థితుల్ని కూడా.. జనసేన ఓ నివేదిక ద్వారా బీజేపీ హైకమాండ్‌కు పంపినట్లుగా తెలుస్తోంది.
తిరుపతిలో ఎవరి బలాలేమిటో.. తేల్చడానికి .. ఏ ఏ వర్గం ఎవరికి మద్దతు ఇస్తుంది..? బీజేపీ వైపు ఉంటారా..? జనసేన వైపు ఉంటారా..? జనసేనకు మద్దతిచ్చేవారు.. బీజేపీ పోటీ చేస్తే మద్దతిస్తారా..? ఇవ్వకపోతే ఎందుకివ్వరు..? అలాంటి అంశాలన్నింటినీ జనసేన వారం రోజులుగా అధ్యయనం చేసింది. ప్రత్యేకంగా ఓ కమిటీని నియమించిన పవన్ కల్యాణ్.. తిరుపతిలో క్షేత్ర స్థాయిలో పరిశీలనకు పంపారు. వారు తిరుపతిలో పార్టీ నేతలందరి అభిప్రాయాలు తెలుసుకున్నారు. చివరికి బీజేపీకి సీటు ఇస్తే.. జనసేన మద్దతు దారులు కూడా సహకరించడం కష్టమన్న అభిప్రాయం వ్యక్తమయింది. దీనికి కారణం ప్రధానంగా సోము వీర్రాజు వ్యవహారశైలేనని జనసేన నేతల నమ్మకం.
పవన్ కల్యాణ్ నియమించిన తిరుపతి పార్లమెంట్ కమిటీలోని కీలక వ్యక్తులు ప్రెస్‌మీట్ పెట్టి.. అనూహ్యంగా ఎప్పుడూ లేని విధంగా సోము వీర్రాజుపై విమర్శల వర్షం కురిపించారు. ఆయన ప్రకటనలు వ్యక్తిగతమేనని తేల్చి చెప్పేశారు. పొత్తు ధర్మం పాటిస్తూ.. జనసేన బహిరంగ విమర్శలు చేయదని సోము వీర్రాజు అనుకుంటూ వస్తున్నారు. కానీ ఆ పొత్తు ధర్మాన్ని తాను పాటించకుండా.. తిరుపతిలో బీజేపీ పోటీకి.. పవన్ కల్యాణ్ అంగీకరించారంటూ ప్రకటనలు చేసేస్తున్నారు. దీంతో తాము సందు ఇస్తే.. జనసేనను విలీనం చేసుకున్నట్లుగా కూడా ప్రకటనలు చేస్తారన్న అనుమానాలు కూడా.. జనసేన నేతల్లో ప్రారంభమయ్యాయి. దీంతో రివర్స్ కౌంటర్ ఇవ్వాల్సిందేనని డిసైడయ్యారు. ఆ మేరకు ప్రకటనలు ప్రారంభించారు.
తిరుపతి ఉపఎన్నికల్లో గత పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి నోటా కంటే తక్కువ సీట్లు వచ్చాయి. అదే సమయంలో.. జనసేనకు మద్దతుగా ఉంటుందని భావిస్తున్న ఓ వర్గం అక్కడ అత్యధికంగా ఉంది. జనసేన పోటీ చేస్తే వారు మద్దతివ్వడానికి అవకాశం ఉంటుంది. కానీ బీజేపీ పోటీ చేస్తే వారు మద్దతిచ్చే చాన్స్ఉండకపోవచ్చు. సోము వీర్రాజు పదవి చేపట్టిన తర్వాత అమరావతికి మద్దతుగా మాట్లాడారంటూ.. ఓవీ రమణతో పాటు మరికొంత మంది నేతలపై వేటు వేశారు. దీంతో ఆ వర్గం సోముపై ఆగ్రహంతో ఉందని అంటున్నారు. మొత్తానికి పవన్ కల్యాణ్ సోము వీర్రాజులా దూకుడుగా కాకుండా.. నింపాదిగా రాజకీయం చేస్తూ.. తనకు కావాల్సిన ఎఫెక్ట్‌ను తాను సాధించుకుంటున్నారని అంటున్నారు. తిరుపతి తమకు కావాల్సిందేనని ఇలాంటి సమగ్ర నివేదికలతో … డిక్లేర్ చేస్తే బీజేపీ అయినా.. ఇవ్వకపోవడానికి చాన్స్ ఉండదు.