గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో జనసేన పోటీ చేయాలని నిర్ణయించింది. మంగళగిరి పార్టీ కార్యకర్తలతో.. దాదాపుగా ఎనిమిది నెలల విరామం తర్వాత తొలి సారిగా పవన్ సమావేశమయ్యారు. ఆ సమావేశంలో ఉండగానే.. గ్రేటర్ ఎన్నికల షెడ్యూల్ వచ్చింది. ఈ అంశంపై .. వెంటనే జన సైనికుల అభిప్రాయాలు తెలుసుకుని.. పోటీ చేయాలని నిర్ణయించుకుంది. గ్రేటర్లో జనసేన శ్రేణులు క్రీయాశీలకంగా ఉన్నారనిని.. పోటీ చేయాలని క్షేత్రస్థాయిలో కార్యకర్తలు బలంగా కోరుకుంటున్నారని పవన్ చెబుతున్నారు. గ్రేటర్లో జనసేన కమిటీలు ప్రజల పక్షాన నిలబడ్డాయని గుర్తు చేశారు. అయితే పవన్ కల్యాణ్ ప్రకటన చాలా మందిని ఆశ్చర్య పరిచింది. ఎందుకంటే.. పోటీ చేస్తామని ప్రకటించారు కానీ.. తన భాగస్వామి బీజేపీ గురించి చెప్పలేదు.
బీజేపీతో కలిసి పోటీ చేస్తారా.. ఒంటరిగా పోటీ చేస్తారా అన్నదానిపై స్పష్టత లేదు. పవన్ కల్యాణ్ ఇలా ప్రకటించగానే అలాగే.. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. జనసేన పార్టీని పెద్దగా ఆయన పట్టించుకోలేదు. తాము ఒంటరిగా పోటీ చేస్తున్నామని… ఎవరితోనూ పొత్తు లేదని ప్రకటించారు. పొత్తుల కోసం ఏ పార్టీ కూడా తమ వద్దకు రాలేదన్నారు. నిజానికి పవన్ కల్యాణ్‌ను బండి సంజయ్, లక్ష్మణ్ ఒకటి, రెండు సార్లు సమావేశమయ్యారు. తెలంగాణలోనూ కలిసి పని చేస్తామని ప్రకటించారు. అయితే తెలంగాణలో జనసేన ఎలాంటి కార్యక్రమాలు చేపట్టలేదు.
బీజేపీ చేపట్టిన కార్యక్రమాలకూ జనసేనను పిలువలేదు. ఇప్పుడు ఎన్నికల సందర్భంగా జనసేన పోటీ చేయాలని నిర్ణయించింది. నామినేషన్లకు పెద్దగా గడువు లేదు. మూడు రోజులు మాత్రమే ఉంది. దీంతో పవన్ కల్యాణ్ .. అభ్యర్థుల్ని ఎలా ఎంపిక చేస్తారో.. మిగతా ఎన్నికల ప్రక్రియ ఎలా కొసాగిస్తారోననన్న ఆసక్తి వ్యక్తమవుతోంది. ఇప్పటికైతే.. జనసేన – బీజేపీ పొత్తు లేనట్లే..!