జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఎవరేమనుకున్నా.. తన పార్టీ విషయంలో.. స్లో అండ్ స్టడీ పద్దతి పాటిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండటంతో వచ్చిన విమర్శలను.. చేతల ద్వారానే తిప్పికొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. లోక్సభ ఎన్నికల్లో కొన్ని చోట్ల అభ్యర్థులను పెట్టిన జనసేనాని.. ఈ సారి రూట్ లెవల్లో బలపడటానికి కొన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా.. గ్రామ స్థాయిలో పోటీ జరిగే.. పరిషత్ పోరాటంలో పాల్గొనే ప్రయత్నంలో ఉన్నారు. జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికల్లో జనసేన తరపున అభ్యర్థుల్ని నిలబెట్టాలనే ఆలోచన పవన్ కల్యాణ్ చేస్తున్నారు. ఈ మేరకు పార్టీ తెలంగాణ నాయకత్వానికి స్పష్టమైన సూచనలు పంపారు.
తనకు అధికారం ముఖ్యం కాదని.. పవన్ కల్యాణ్ పదే పదే చెబుతూంటారు. అదే సమయంలో.. పాతికేళ్ల రాజకీయం చేస్తానని చెబుతూ ఉంటారు. తెలంగాణలో.. గ్రామస్థాయి నుంచి బలపడే ఆలోచన ఉండటంతో… దానికి పరిషత్ ఎన్నికలు మంచి అవకాశం అని.. జనసేనకు చెందిన నేతలు ఓ అభిప్రాయానికి వచ్చారు. ఈ విషయంలో… కొంత మంది పార్టీ క్యాడర్ కూడా.. పోటీకి ఉత్సాహం చూపిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అన్ని స్థానాల్లో కాకపోయినా… కొన్ని కొన్ని స్థానాల్లో అయినా జనసేన తరపున అభ్యర్థులను పోటీలో నిలబడితే.. ముందుగా బేస్ పెరుగుతుందని పవన్ కల్యాణ్ ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది.
అసెంబ్లీ ఎన్నికల్లో తగిలిన ఎదురుదెబ్బతో… టీడీపీ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఆ పార్టీకి చెందిన బలమైన నేతలందర్నీ.. నయానో .. భయారో.. టీఆర్ఎస్లో చేర్చుకుంటున్నారు. ఒకప్పుడు తెలంగాణలో తిరుగులేని శక్తిగా ఉన్న టీడీపీ ఇప్పుడు.. పరిషత్ ఎన్నికల్లో పోటీ చేస్తుందో లేదో తెలియడం లేదు. అలాగే.. వైసీపీ పూర్తిగా చేతులెత్తేసింది. ఆ పార్టీని దాదాపుగా టీఆర్ఎస్లో విలీనం చేసినట్లే. ఇలాంటి సమయంలో… పవన్ కల్యాణ్.. సాహసోపేతంగా ముందడుగు వేస్తున్నట్లుగానే భావించాలి. వందల్లో ఉన్న జడ్పీటీసీల్లో కనీసం ఓ పది సాధించినా… జనసేన కు..తెలంగాణలో భవిష్యత్ ఉన్నట్లే భావించాలి.