ఎమ్మెల్యే కోటాలో జరగనున్న రెండు ఎమ్మెల్సీ స్థానాలకు చంద్రబాబు అభ్యర్థులను ఖరారు చేశారు. ఒక స్థానాన్ని రాజీనామా చేసిన సి.రామచంద్రయ్యకే కేటాయించారు. మరో స్థానాన్ని రాజీనామా చేసిన ఇక్బాల్ కు కాకుండా.. జనసేన కోటాలో పిడుగు హరి ప్రసాద్ కు కేటాయించాారు. హరిప్రసాద్ జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి పవన్ తో పాటే ఉన్నారు. ఈటీవీలో జర్నలిస్టుగా ఉన్న ఆయన తర్వాత పవన్ వద్ద చేరారు. మొత్తం మీడియా వ్యవహారాలు ఆయనే చూసుకుంటారు. ఆయనకు పవన్ ఎమ్మెల్సీ సీటు ఇప్పించారు.
ఈ రెండు ఎమ్మెల్సీల పదవీ కాలం రెండేళ్లు మాత్రమే ఉంది. ఆ తర్వాత మరోసారి ఎన్నికలు జరుగుతాయి. అప్పుడు మళ్లీ వీరికే కేటాయిస్తారా వేరే వారికి ఇస్తారా అన్నది అప్పుడు డిసైడ్ చేస్తారు. వచ్చే ఐదేళ్ల కాలంలో ఎమ్మెల్సీ, రాజ్యసభ ఎలాంటి ఎన్నికలు వచ్చినా పూర్తిగా కూటమికే దక్కుతాయి. ఈ పదవుల కోసం బీజేపీ, జనసేన పార్టీలు కూడా పోటీ పడే అవకాశాలు ఉన్నాయి. అన్ని పదవుల్లోనూ అవకాశాలు కల్పిస్తామని ముందుగానే హామీ ఇచ్చారు.
పిడుగు హరిప్రసాద్ శాసనమండలిలో మొదటి జనసేన పార్టీ ఎమ్మెల్సీ అవుతారు. వైసీపీ ఎమ్మెల్సీలు ఇద్దరిపై పట్టుబట్టి మరీ వైసీపీ అధినాయకత్వం అనర్హత వేటు వేయించింది. ఆ తొందరపాటు నిర్ణయం తీసుకోకపోతే సాంకేతికంగా అయినా వారు వైసీపీ ఎమ్మెల్సీలుగానే ఉండేవారు.