పంచాయతీ నిధుల్ని జగన్ దారి మళ్లించేశారని ఆరోపిస్తూ… కలెక్టరేట్ల ముందు ఏపీ బీజేపీ ధర్నాలు చేసింది. ఇందులో జనసేన నేతలు కూడా పాల్గొన్నారు. ఒంగోలు, తిరుపతి వంటి చోట్ల జనసేన నేతలు…కార్యకర్తల జెండాలు బీజేపీ కన్నా ఎక్కువగా కనిపించాయి. ఇప్పటి వరకూ ఎప్పుడూ… బీజేపీ పిలుపునిచ్చిన కార్యక్రమాల్లో జనసేన… జనసేన పిలుపునిచ్చిన కార్యక్రమాల్లో బీజేపీ పాలు పంచుకోలేదు. పొత్తులో ఉన్నామంటారు కానీ కలసి పని చేయలేదు.
పురందేశ్వరి ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. పవన్ తో ఫోన్ లో మాట్లాడతానని.. కలిసి పోరాటం చేస్తామని ఒకటి రెండు సార్లు ప్రకటించారు. అలా మాట్లాడారో లేదో కానీ జనసేన నేతలు బీజేపీ పోరాటాల్లో పాలు పంచుకుంటున్నారు. ఇంత కాలం లేని సహకారం ఇప్పుడే ప్రారంభం కావడంతో… అంతర్గతంగా ఏదో జరిగే ఉంటుందని… పవన్ కల్యాణ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఉంటారని భావిస్తున్నారు.
ఇటీవల పవన్ కల్యాణ్ రాజకీయ ప్రకటనలు గందరగోళంగా ఉంటున్నాయి. ఆయన వ్యూహం ఏమిటో జనసైనికులకే అర్థం కావడం లేదు. సోము వీర్రాజు వైసీపీ ఏజెంట్ అని నమ్మడంతోనే దూరంగా ఉన్నారని.. ఇప్పుడు పురందేశ్వరి అలా కాదని నమ్మడంతోనే జనసేన క్యాడర్ కు బీజేపీ ధర్నాల్లో పాల్గొనే అనుమతి ఇచ్చారని అంటున్నారు. అయితే విశాఖలో జనసేన వారాహియాత్రలో మాత్రం బీజేపీ జెండాలే కనిపించలేదు. ఆ పార్టీని దగ్గరకు రానివ్వలేదు.