రాజకీయాల్లో అహంకారం తలకెక్కితే.. అది పతనానికే దారి తీస్తుంది. కొద్దిగా సమయం పడుతుంది అంతే. బీజేపీకి సహకరించాలని పెద్ద మనుసుతో.. గ్రేటర్ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ తీసుకున్న నిర్ణయంపై బీజేపీ నేతలే అవహేళన చేశారు. తమకు మేలు చేశారని భావించకపోగా.. అసలు పవన్ ఓ లీడరా అన్నట్లుగా మాట్లాడారు. జనసేనతో అసలు పొత్తే లేదన్నారు. ఆ పార్టీతో స్నేహమే లేదన్నారు. అన్నన్ని మాటలు మాట్లాడినా… ఒక్కరంటే ఒక్కరూ ఖండించలేదు. హైకమాండ్ కూడా పట్టించుకోలేదు. దీంతో పవన్ కల్యాణ్ టైం చూసి షాకిచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరుగుతున్న సమయంలో టీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతు ప్రకటించారు. ఇప్పుడు స్వల్పతేడాతో బీజేపీ హైదరాబాద్ ఎమ్మెల్సీ సీటును కోల్పోయింది. ఇప్పుడు బీజేపీ నేతలు నాలిక్కరుచుకున్నారు.
అయితే… ఇంతటితో వదిలి పెట్టాలని పవన్ కల్యాణ్ అనుకోవడం లేదు. జనసేనను తెలంగాణలో బలోపేతం చేయాలని నిర్ణయించుకున్నారు. బీజేపీ పెద్దలు ఎలాంటి ఒత్తిళ్లు తీసుకొచ్చినా వెనక్కి తగ్గకుండా… బీజేపీతో ఎలాంటి పొత్తులు లేకుండానే త్వరలో జరగనున్న ఖమ్మం, వరంగల్ కార్పొ రేషన్, నాగార్జునసాగర్ ఉపఎన్నికల బరిలో నిలిచేందుకు నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలోని పవన్ కల్యాణ్ అభిమానులు ఇప్పటికి ఇతర పార్టీల్లో ఉన్నారు. వారందర్నీ ఒకే వేదికపైకి తీసుకు వచ్చి జనసేన కార్యక్రమాల్లో యాక్టివ్ చేయాలని నిర్ణయించుకున్నారు. ‘తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల సాధన కోసమే జనసేన పోరాటం’ అనే నినాదంతో తెలంగాణలో విస్తృతంగా జనసేన పార్టీని విస్తరించాలని పవన్ కల్యాణ్ రూట్ మ్యాప్‌ను రెడీ చేసుకున్నారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్లతో పాటు.. సాగర్ ఉపఎన్నికల్లో జనసేన నిలబడితే.. బీజేపీకి ఇబ్బందికరం అవుతుంది. జనసేనతో సఖ్యత ఉంటే ఆ పార్టీ ఓట్లు నాలుగైదు శాతం అయినా… బీజేపీకి పడతాయి. ఇప్పుడవి చీలిపోతాయి. ఈ ప్రభావం.. పది శాతం వరకూ పడుతుంది. ఇప్పుడు బీజేపీ నేతలు పవన్ కల్యాణ్‌తో రాజీ ప్రయత్నాలు చేసినా… ఫలితం ఉండదని చెబుున్నారు. సాగర్ ఉపఎన్నిక కోసం జనసేన అధినేత ఓ కమిటీని కూడా నియమించారు. ఆ కమిటీ అన్ని పరిశీలించి ఓ నిర్ణయం తీసుకుంటుంది. ఆ నిర్ణయాల్లో బీజేపీతో పొత్తు అనే ఆప్షన్ లేనే లేదని జనసేన వర్గాలు చెబుతున్నాయి. అంటే తెలంగాణలో బీజేపీకి జనసేన పూర్తిగా దూరమయినట్లే. రాజకీయాల్లో గెలుపు అహంకారం తలకెక్కితే.. ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో.. .నిరూపించే దృశ్యాలు తెలంగాణలో ఇప్పుడు సాక్షాత్కారమవుతున్నాయి.