పరిషత్ ఎన్నికల్లో ఊహించిన దాని కన్నా ఎక్కువ ఫలితాలు వచ్చాయని జనసేన సంతృప్తిగా ఉంది. అధికార పార్టీ దాడులు, దౌర్జన్యాలను ఎదుర్కొని మరీ క్యాడర్ నిలబడ్డారని పవన్ కల్యాణ్ కూడా సంతోషంగా ఉన్నారు. ఈ క్రమంలో తదుపరి కార్యాచరణను ప్రారంభించాలని జనసేన నిర్ణయించుకుంది. ఏపీలో రోడ్ల పరిస్థితులపై ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోది. గత నెలలో మూడు రోజుల పాటు డిజిటల్ ఉద్యమం చేసి.. రోడ్ల దుస్థితిని ప్రజల ముందుపెట్టిన జనసేన ఇక నుంచి కార్యాచరణలోకి దిగాలని నిర్ణయించుకుంది.
నేరుగా రోడ్లను తామే రిపేర్ చేయాలని నిర్ణయించుకుంది. ఇందు కోసం గాంధీగిరి పద్దతిలో నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. గాంధీ జయంతి అయిన అక్టోబర్ రెండు నుంచి జనసేన రంగంలోకి దిగనుంది. రోడ్లకు సొంతంగా మరమ్మత్తులు చేపట్టనుంది. శ్రమదానం చేయాలని నిర్ణయించింది. పరిస్థితిని బట్టి సొంతంగా మట్టి తోలడం.. గుంతలు పూడ్చడం వంటివి చేయనుంది. జన సైనికులు అందరూ స్వచ్చందంగా ఈ శ్రమదానంలో పాల్గొనేలా చూడాలని నిర్ణయించారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా స్వయంగా శ్రమదానం చేయాలని నిర్ణయించుకున్నారు. ఆయన కూడా అక్టోబర్ రెండు, మూడు తేదీల్లో స్వయంగా శ్రమదానం చేస్తారు. ఈ కార్యక్రమంతో పూర్తి స్థాయిలో ప్రజాభాగస్వామ్యం చేపట్టినట్లవుతుందన్న భావనతో జనసేన ఉంది. ఎన్నికల మూడ్ పెరుగుతున్న సమయంలో ఇక ఎక్కువగా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలన్న ఆలోచనలో జనసేన ఉంది.