గ్రేటర్ ఎన్నికల బరి నుంచి జనసేనను తప్పించేసింది భారతీయ జనతా పార్టీ. అభ్యర్థులను ప్రకటించి.. సోషల్ మీడియాలో మార్పు కోసం జనసేన అనే పేరుతో ప్రచారం కూడా ప్రారంభించిన జనసేన పార్టీ నేతలకు.., పవన్ కల్యాణ్ ఊహించని షాక్ ఇచ్చారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, కే లక్ష్మణ్ వచ్చి అడగగానే… బీజేపీకి మద్దతు ప్రకటించి తాను ఎన్నికల బరి నుంచి వైదొలుగుతున్నట్లుగా పవన్ కల్యాణ్ ప్రకటించేశారు. గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేస్తామని.. క్యాడర్ నిబద్ధతతో ఉందని… పవన్ కల్యాణ్.. నోటిఫికేషన్ వచ్చిన రోజున ప్రకటించారు. దీంతో పెద్ద ఎత్తున పవన్ ఫ్యాన్స్, జనసేన పార్టీ నేతలు.. పోటీ చేయడానికి.. ఉబలాటపడ్డారు. జనసేన పార్టీ నేతలు బీఫాంలు కూడా పంపిణీ చేశారు. ఈ మధ్యలో పొత్తుల గురించి చర్చ జరిగింది. కానీ.. తాము ఎవరితో పొత్తు పెట్టుకునేది లేదని.. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రకటించేశారు. దాంతో ఇక పొత్తు లేదు.. ఎవరికి వారు పోటీ చేస్తారని అనుకున్నారు.
ఈ లోపు కిషన్ రెడ్డి సీన్ మార్చేశారు. నాదెండ్ల మనోహర్‌తో చర్చలు జరిపి.. భేటీ ఖరారు చేశారు. నాదెండ్ల మనోహర్ ఇంట్లోనే కిషన్ రెడ్డి, లక్ష్మణ్‌లతో.. పవన్ సమావేశమయ్యారు. చర్చల తర్వాత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి జనసేన సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లుగా పవన్ ప్రకటించారు. కార్యకర్తలకు ఇష్టం లేకపోయినా తప్పుకుంటున్నామని.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ గెలవాల్సిన అవసరం ఉందని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. హైదరాబాద్‌లో బలమైన నాయకత్వం ఉండాలని.. ఒక్క ఓటు కూడా పోకుండా జనసైనికులు బీజేపీకి సహకరించాలని పిలుపునిచ్చారు. ఏపీలో మాదిరిగా తెలంగాణలోనూ బీజేపీతో కలిసి పనిచేస్తామన్నారు. సమయం లేకపోవడం.. కమ్యూనికేషన్ గ్యాప్‌తో పొత్తు పెట్టుకోలేకపోయామని.. బీజేపీతో కలిసి పనిచేయడంపై రోడ్ మ్యాప్ రూపొందిస్తామని పవన్ తెలిపారు.
కేవలం పోటీ నుంచి ఉపసంహరించుకోవడమే కాదు.. పవన్ కల్యాణ్.. గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ తరపున ప్రచారం కూడా చేయబోతున్నారు. ఈ విషయాన్ని పవన్ కల్యాణ్ ఎదురుగానే లక్ష్మణ్ ప్రకటించారు. పెద్ద మనసుతో ఒప్పుకున్నారని ఆనందం వ్యక్తం చేశారు. కనీసం పదో.. ఇరవయ్యే సీట్లు తీసుకుని పొత్తు పెట్టుకుని ఉంటే కాస్త గౌరవంగా ఉండేదని.. ఇప్పుడు.. అసలు పోటీ నుంచి వైదొలగడం అంటే.. నామోషీనేనని జనసేన కార్యకర్తలు మథన పడుతున్నారు. పవన్ కల్యాణ్ రాజకీయ వ్యూహాలు.. పార్టీకి ఉపయోగపడేలా లేవని.. ఆయనకు సలహాలిస్తున్న వారు.. తప్పులు చేస్తున్నారని.. బాధపడుతున్నారు. కానీ.. వారి బాధను పట్టించుకునేవారు లేరు.