జనసేన విషయంలో భారతీయ జనతా పార్టీ వ్యవహరిస్తున్న తీరు వివాదాస్పదమవుతోంది. ప్రభుత్వం ఎన్నో అరాచకాలు చేస్తున్నా ఇంత కాలం ఒక్క సారిగా రోడ్డెక్కే ఆలోచనే బీజేపీ చేయలేదు. ఆందోళనలు అనే మాటే రానీయలేదు. ఇంకా ఏమైనా అంటే ప్రభుత్వాన్ని డిఫెండ్ చేస్తూ.. ప్రతిపక్షాన్ని విమర్శిస్తూ ఉంటారు. అదే సమయంలో.. పొత్తు పెట్టుకున్న దగ్గర్నుంచి పవన్ కల్యాణ్‌ను కూడా నియంత్రించారు. అయితే.. తొలి సారి పవన్ కల్యాణ్.. వరద బాధితులను పరామర్శించేందుకు.. జిల్లాల పర్యటనలు చేస్తున్నారు. ఈ పర్యటనల్లో బీజేపీ పాల్గొనకపోగా..పోటీగా… రోడ్లు బాగోలేవంటూ రాస్తారోకోలు చేపట్టింది. ఇది ఇప్పుడు జనసేన నేతల్లో తీవ్ర చర్చనీయాంశం అయింది.
జనసేన – బీజేపీ పొత్తులో ఉన్నాయి. ఏం చేపట్టినా ఇద్దరూ కలిసే చేపట్టాలి. అయితే ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించేవాటిని బీజేపీ నేతలు లైట్ తీసుకుంటున్నారు. చూసీ చూసీ పవన్ కల్యాణ్ ఇప్పుడు రంగంలోకి దిగారు. రైతులకు అండగా నిలవకపోతే.. తన రాజకీయంపై ప్రజల్లో అనుమానాలు ప్రారంభమవుతాయని.. రంగంలోకి వచ్చారు. వెంటనే బీజేపీ.. పవన్ కు కౌంటర్ స్టార్ట్ చేసింది. రోడ్లు బాగోలేవని ప్రభుత్వంపై ఉద్యమం అంటూ… నిరసనలు చేపట్టింది. రోడ్ల ఉద్యమం చేయవద్దని ఎవరూ అనలేదు కానీ… ఖచ్చితంగా పొత్తులో ఉన్న పార్టీ జనసేన అధినేత… స్వయంగా రైతుల్ని పరామర్శిస్తూంటే.. ఆ టూర్‌కు సంఘిభావం చెప్పకపోగా.. పోటీ కార్యక్రమాలు నిర్వహించడం ఏమిటన్న చర్చ మాత్రం ప్రారంభమయింది.
తిరుపతి ఉపఎన్నిక విషయంలోనూ… పవన్ కల్యాణ్‌ను తీసేసినట్లుగా బీజేపీ నేతలు మాట్లాడుతున్నారు. తిరుపతిలో పోటీ చేసి తీరుతామని.. తమకు పవన్ కల్యాణ్ మద్దతివ్వాల్సిందేనన్నట్లుగా మాట్లాడుతున్నారు. కానీ పవన్ కల్యాణ్ మాత్రం..తిరుపతిలో తాము పోటీ చేయాల్సిందేననే నిర్ణయానికి వచ్చినట్లుగా కనిపిస్తోంది. చిత్తూరు, నెల్లూరు జిల్లాల పర్యటనలో ఆయన ఈ విషయాన్ని పార్టీ నేతలకు తేల్చి చెప్పారని అంటున్నారు. పవన్ కల్యాణ్…జనంలోకి వెళ్తే.. జనసేన బలం ఏంటో తెలుస్తుంది. బీజేపీ నేతలు అక్కడ తేలిపోతారు. అందుకే జనసేనను నిర్వీర్యం చేసి.. అధికార పార్టీకి ఎక్కువ మేలు చేయడానికే.. పొత్తు గేమ్ ఆడుతున్నారన్న అనుమానాలు జన సైనికుల్లో ప్రారంభమవుతున్నాయి.
మొదట్లో.. బీజేపీ, జనసేన నేతల సమన్వయ కమిటీ ఏర్పాటు చేసుకుని కార్యక్రమాలు నిర్వహించుకుని ముందుకు వెళ్తామని అనుకున్నారు. ఆ సమన్వయ కమిటీని ఇంత వరకూ నియమించలేదు. నియమించినా సమావేశాలు జరగవు. చాలా కాలం సైలెంట్ గా ఉన్న పవన్.. ఇప్పుడు పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. పవన్ కు పోటీగా.. బీజేపీ కూడా కార్యక్రమాలు చేపట్టింది. మొత్తానికి జనసేన-బీజేపీది పొత్తా లేకపోతే ఇంకొకటా అన్న అనుమానాలు మాత్రం.. అందరిలోనూ ప్రారంభమయ్యాయి.