ఆంధ్రప్రదేశ్ ప్రజల పరిస్థితి రోజు రోజుకు దుర్భరంగా మారుతోంది. ఈ విషయం ప్రజలపై వేస్తున్న చెత్త పన్నుల దగ్గర్నుంచి కరెంట్ చార్జీల పెంపు వరకూ అన్ని విషయాల్లోనూ స్పష్టంగా కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితిని జనసేన పార్టీ తనకు అనుకూలంగా మార్చుకుంటోందా ? అని విశ్లేషిస్తే… ప్చ్ అని పెదవి విరవక తప్పదు. ఇంత వరకూ ఎలాంటి ప్రజా ఉద్యమాలు చేపట్టే ప్రయత్నం చేయలేదు. మీడియాలో ఇళ్లలో చెత్తపోశారనో… పన్ను కట్టలేదని ఇంటికి తాళం వేశారనో ప్రచారం జరిగినప్పుడు పవన్ కల్యాణ్ ట్వీట్లు పెట్టడం మినహా చేసిందేమీ లేదు.
కరెంట్ చార్జీల పెంపు విషయంలో ప్రకటన వచ్చిన తర్వాత పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు. కానీ వెంటనే రంంలోకి దిగలేదు. అప్పటికే టీడీపీ నిరసనలు ప్రారంభించేసింది. ఒక రోజు తర్వాత తాము రోడ్డెక్కుతున్నామని జనసేన నేతలు ప్రకటించారు. కానీ సరైన సమయంలో స్పందించకపోవడం వల్ల జనసేనకు ప్రజల కోసం పోరాడుతున్నామన్న మైలేజీ రావడం.. అలాంటిఇమేజీ తెచ్చుకోవడం కష్టమవుతోంది. ప్రజాఉద్యమాలను ఎప్పటికప్పుడు గొప్పగా నిర్మిస్తేనే ప్రత్యామ్నాయంగా ఎదుగుతారు.
జనసేన పార్టీ క్యాడర్‌కు సరైన దిశానిర్దేశం లేక ప్రభుత్వంపై ఏ రూపంలో పోరాడాలో తెలియక తంటాలు పడుతున్నారు. సోషల్ మీడియాలో జనసైనికులు తమ అభిప్రాయాలను నిర్మోహమాటంగా పెడుతున్నారు. ప్రభుత్వం కేసులు పెడుతుందని తెలిసినా వెనక్కి తగ్గడంలేదు. అలాంటి వారికి పై నుంచి ఎంత సపోర్ట్ ఉంటుందో కానీ వారు పార్టీ పట్ల నిబద్ధత ప్రదర్శిస్తున్నారు. అయితే పై స్థాయి నాయకత్వంలోనే పూర్తి స్థాయిలో కదలికలేకపోవడం వల్ల ప్రభుత్వ వ్యతిరేకతను పూర్తి స్థాయిలో తమకు అనుకూలంగా మల్చుకోలేకపోతున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఇలాంటి సంస్థాగత లోపాల్ని ఎంత త్వరగా పరిష్కరించుకుంటే జనసేనకు అంత మంచిదని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.