జనసేన పార్టీ తెలంగాణలో పోటీ చేసిన ఎనిమిది నియోజకవర్గాల్లో కనీస ప్రభావం చూపలేకపోయింది. కూకట్ పల్లి స్థానంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నా.. అక్కడా డిపాజిట్ రావడం కష్టంగా మారింది. బీఆర్ఎస్ అభ్యర్థి మాధవరం కృష్ణారావు భారీ మెజార్టీతో గెలవడం ఖాయమయింది. గ్రేటర్ పరిధిలో పొత్తులో భాగంగా బీజేపీ కూకట్ పల్లి ఒక్క సీటునే కేటాయించింది. ఆ సీటులో గెలుపు కోసం పవన్ కల్యాణ్ ఓ బహిరంగసభతో పాటు రెండు రోజుల పాటు ర్యాలీ నిర్వహించారు. కానీ ప్రయోజనం లేకపోయింది. సెటిలర్లు ఎక్కువగా ఉండే నియోజకవర్గంలో బీఆర్ఎస్ తన పట్టు నిలుపుకుంది. ఇక తాండూరు, నాగర్ కర్నూలు, కోదాడ వంటి వంటి నియోజకవర్గాల్లో డిపాజిట్లు రాలేదు.
ఖమ్మం, అశ్వారావు పేట వంటి చోట్ల అసలు పట్టించుకున్న వారు లేరు. మొత్తంగా జనసేన ఎనిమిది స్థానాల్లో ఒక్క కూకట్ పల్లిలో మాత్రం కాస్త ఓట్లు తెచ్చుకున్నారు కానీ.. అదీ కూడా గౌరవప్రదమైన ఓట్లు కాదు. జనసేన పార్టీ మామూలుగా బీజేపీతో సంబంధం లేకుండా పోటీ చేయాలనుకుంది. తర్వాత బీజేపీ కలుపుకుంది. ఎనిమిది సీట్లు ఇచ్చింది. ఆ ఎనిమిది సీట్లలో బీజేపీకి పెద్దగా బలం లేదు. జనసేన పార్టీకి క్యాడర్ లేకపోవడంతో.. పోటీ చేసిన చోట్ల.. గట్టిగా ప్రచారం చేయడానికి కూడా ఇబ్బందులు పడ్డారు.
బీజేపీ వైపు నుంచి సహకారం శూన్యమయింది. చివరికి కూకట్ పల్లిలో బీజేపీకి కొంత బలం ఉన్నా.. వారి ఓట్లు చివరికి బీఆర్ఎస్ వైపు మళ్లించారు. దీంతో జనసేన పార్టీకి డిపాజిట్ కూడా రాకుండా పోయింది. అయితే తెలంగాణలో పోటీ చేయడమే జనసేన పార్టీ సాధించిన విజయం అనుకోవచ్చు.